అవి యథార్థమని నమ్మి ఎండవమావుల కోసం పరిగెత్తే లేడి కూనలలాగా పరుగెత్తుతున్నారు మానవులు. అంతకన్నా మౌఢ్యం లేదు. తత్త్వమేదో తెలియక తత్త్వాభాస కోసం పెనగులాడటం మౌఢ్యం కాక ప్రౌఢి ఎలా అవుతుంది. మరి తత్త్వమేమిటి. అది ఎలా దొరుకుతుంది. అదే లక్ష్మీపతి. నామ రూపాత్మకమైన జగత్తంతా లక్ష్మి అయితే దీనికి మూలమైన పదార్థం కాబట్టి అది ఈ లక్ష్మికి పతి. ఇది నామరూపాత్మకమైతే అది అనామం. అరూపం. అంటే అవిషయమైన మన ఆత్మచైతన్యమే. ఇలాటి చైతన్యమే నని పట్టుకోవాలి దాన్ని. పట్టుకోటానికేమిటి ఆలంబనం. ఆయనగారి పాదయుగమే. అంటే ఈ నామరూపాలే. “పద్యతే ఆభ్యామితి పదమ్ – పదమేవ పాదమ్” దేని ద్వారా తత్త్వాన్ని చేరగలమో అది పాదం. అది ఈ నామరూపాలు రెండే. అవి ఎక్కడో అందరానిచోట లేవు. విలసత్ - వివిధ పదార్ధాలలో మనచుట్టూ ఎక్కడ పడితే అక్కడ లసత్ - ప్రకాశిస్తూనే ఉన్నాయి. వీటిని పలకరిస్తే చాలు. దాని గుట్టు మనకు బయటపెడుతాయి. అయితే ఎంతో చిత్త సంస్కారముండాలి దానికి అది లేకుంటే దాన్ని ఎలాగైనా ప్రసాదించమని ఆ తత్త్వాన్ని వేడుకోవాలి మనం. అదే లక్ష్మీపతీ నాకు నీ విలసత్పాద యుగంబు చూపమని వాపోతున్నాడు అక్రూరుడు. మనమూ అక్రూర చేతస్కులమై ప్రార్ధిస్తేనే మనకది ప్రసాదిస్తాడు పరమాత్మ.
ఇలా చూస్తూ పోతే కృష్ణుడు పుట్టి పెరిగి చేసిన చేష్టలన్నీ మానవోచితం కావు. అవి మానవాతీతమైనవి. జన్మలేని ఈశ్వరుడే లోకంలో జన్మించి ఏ వ్యవహారమూ లేని ఈశ్వరుడే నలుగురితో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే దానికి కృష్ణజననం దగ్గరి నుంచీ ప్రతిఒక్కటీ నిదర్శనమే. ప్రతి ఒక్కటీ ధర్మ సంస్థాపన కోసమే. అదే గదా అవతార ప్రయోజనం. దుష్టనిగ్రహ మొకవైపయితే శిష్టానుగ్రహం మరొకవైపు. ఎవరెవరిని ఎప్పుడంతమొందించాలో ఒక ప్రక్క ఆలోచన. మరొక ప్రక్క ఎవరి నెప్పుడెలా ఉద్దరించాలో విచారణ. ఉద్దవుడికాయన చేసిన ఉపదేశ మాయన శిష్ట జనానుగ్రహంలో ఆఖరిది. చివర ఇక నిర్యాణమయి పోయే క్షణంలో జరిగిందది. ఆ నిర్యాణం కూడా ఎంత పరమాద్భుతంగా సాగిన వ్యవహారమో మనకర్థం కాదు. అసలాయన బంధు మిత్రాదులకే గాదు. భార్యా పుత్రులకే గాదు. ఏ ఒక్కరికీ అంతుపట్టలేదు. పట్టనీయలేదాయన. అదీ ఒక లీలే. లేకుంటే
Page 161