రక్షణం గోచరిస్తుంది. పోతే యశంబు దిక్కులం జల్లెడువాడు నైన రఘు సత్తముడిచ్చుత మాక భీష్టముల్. ఇలాటి గుణసంపద ఉన్నవాడికే యశస్సంపద. వాడే లోకుల కభీష్ట ఫలప్రదాత కాగలడు. ఉత్తమ మానవ మానవేంద్రోచితమైన వర్ణన ఇది. మానవాతీతమైన వర్ణన ఇంతకు ముందరిది. అది నివృత్తి ధర్మ స్వరూపాన్ని - ఇది ప్రవృత్తి ధర్మస్వరూపాన్ని లోకులకు సూచించటానికి మహాకవి చేసిన చిత్రరచన.
మొత్తంమీద భగవత్తత్త్వాని కెక్కడి కక్కడ అద్దం పట్టినట్టే కనిపిస్తుంది గోపికలు చేసే ప్రతి ఆలాపనలో. ఇలాటి భగవల్లీలనే అక్రూరుడు కూడా దర్శించి ఎంతగానో కీర్తిస్తాడు.
“కలలం బోలెడి పుత్ర మిత్ర వనితా గారాది సంయోగముల్ జల వాంఛారతి నెండ మావులకు కాంక్షల్ సేయు చందంబునన్ తలతున్ సత్యములంచు మూఢుడ - వృథా తత్త్వజ్ఞుడన్ నాకునీ విల సత్పాద యుగంబు జూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ”
అక్రూరుడు యాదవుల కులపెద్దలలో ఒకడు. విభీషణుడి లాంటి స్వభావ మతనిది. భీషణుడు కానివాడు విభీషణుడైతే క్రూరుడే మాత్రమూ కాని వాడక్రూరుడు. అలాంటి వాడి నతిక్రూరుడైన కంసుడొక క్రూరమైన పనికి నియోగించాడు. ధనుర్యాగమనే నెపంతో రామకృష్ణులను తీసుకురా వారి పని నేను చూచుకొంటానని పంపుతాడు. అతడు కాదని చెప్పలేదు. ఇదీ ఒక దైవ చేష్టితమే నని నిర్లిప్తతతో బయలుదేరి బృందావనం చేరుతాడు. రామకృష్ణులను దర్శించి రాజాదేశమందిస్తే మందహాసం చేస్తూ వారతని వెంట బయలుదేరుతారు. దారిలో యమునా నదిలో దిగి స్నానం చేసి అతడు లేచి నిలబడగానే ఆ నీళ్లలో కనిపిస్తారు రామకృష్ణులు. ఇదే మా రథంలో కదా ఉన్నది వారీ నీళ్లలోకి ఎప్పుడు వచ్చారా అని చూస్తే మరలా రథంలోనే కనిపిస్తారు. ఇలా మార్చి మార్చి అక్కడా ఇక్కడా కనిపించటం చూడగా అప్పుడర్థమవుతుందాయన కెక్కడా ఉన్నది పరమాత్మే మరేదీ లేదని. అప్పుడు చేసిన స్తోత్రమిది. అద్వైత భావమంతా పుణికి పుచ్చుకొన్న పద్యమిది. మానవుడి శరీర మనః ప్రాణాదులతో సహా మనదీ అనుకొన్న సర్వమూ నిజంలో మనది కాదు. అవన్నీ కలలో చూచిన వస్తువుల లాంటివే. ఒక్కటీ నిజంగాదు. అనవసరంగా
Page 160