సుందరమది అసుందరమని లేదు. "రమ్యమ్ జుగుప్సిత ముదార మథాపి నీచ”మన్నారు పెద్దలు. తత్తద్దేశ కాల వ్యక్తి వయోపస్థాదులను బట్టి ఎక్కడ ఏది ఎప్పుడెలా ఉండాలో అక్కడ అదే సుందరం. అలా లేకపోతే అదే అసుందరం. సర్వత్రా ఆ విశ్వ చైతన్య మనుస్యూతమయ్యే ఉంది. ఆ అంత సూత్రాన్ని పట్టుకొని చూచినప్పుడంతా రమణీయమే. ఏదీ హేయం కానేరదు. ఒక దేవతల సృష్టి ఎలాటిదో దానవుల సృష్టి అలాటిదే. రెండూ వాటి వాటి స్థానాలలో అవి సుందరమే. ప్రబోధకమే. ప్రబోధకమెలా అయిందని అడుగరాదు. మంచి చెడ్డలను వర్ణించటంలో కూడా వారు లోకోద్ధరణమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. "వినేయ జన హితార్థమేవ నాటకాది గోష్ఠిలోకే ముని భి రవ తారితా” అని కావ్య విమర్శకుల సూక్తి. కావ్య నాటకాది గోష్ఠి కూడా భరతాది మహర్షులు లోకహితార్ధమే కావించారట. శివేతర క్షతి అని, విశ్వశ్రేయస్సని, జగద్ధితమని, లోక కళ్యాణమని, మహాకవులు వాకొనటంలో ఇదే ఆంతర్యం. సూటిగానో, చాటుగానో దానిని సాధించటమే వారు చేసిన పని. అందులో మంచిని సూటిగా బోధిస్తే చెడ్డను చాటుగా బోధించారు. మంచిని బోధించటం దాని నాచరించమని చెప్పటానికి. చెడ్డను బోధించటం దాని నుంచి వైదొలగమని చాటటానికి. “రామాదివద్వర్తి తవ్యమ్ న రావణాదివ" త్తని గదా ఆభాణకం.
ఈ లోకహిత కామనతోనే వ్యాస వాల్మీకి ప్రభృతులు ఉచ్ఛావచంగా పాత్రలను సృష్టించటం. జుగుప్సాకరంగా ఉద్వేజకంగా కనిపిస్తున్నా ఆయా సన్నివేశాలు కల్పించటం. మహర్షుల అప్సరసల, ప్రజాపతుల కోపతాప జారచోరాది వ్యవహారమంతా ఇందుకే. తద్ద్వారా ఎన్నో హెచ్చరికలు లోకానికి చేయటమే వారి ఉద్దేశ్యం. కథ గాదిక్కడ మనం చూడవలసింది. పాత్రలంతకన్నా కావు. ఈ కథలూ, పాత్రలూ వారి ప్రవృత్తులూ, ఇదంతా ఒక అర్థవాదం Allegory. ఒక సంకేతం Symbolism ప్రపంచంలాగా సాహిత్య ప్రపంచం కూడా సంకేతమేనని గదా చెప్పాము. దానిలోలాగా దీనిలో కూడా ఆది మధ్యాంతాలలో అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉన్నదా విశ్వ చైతన్య ధారే. దానిని మరచిపోకుండా మనకడుగడుగునా స్ఫురింపజేయటానికే ఈ కథలూ, పాత్రలూ
Page 16