#


Index

అవతారములు - కృష్ణతత్త్వము భాగవతము

దొర లక్షణాలే ననిపిస్తాయి. కాకపోయినా దొంగ ఎవడో గాదు. కృష్ణుడే గదా. గోపికల దృష్టిలో ఆయన దొరేగాని దొంగ కాదు. కృష్ణుడంటే నల్లనివాడే మరి. నీలమేఘశ్యాముడు గదా. పద్మ నయనంబుల వాడు. కమలాక్షుడు పుండరీకాక్షుడని గదా ప్రసిద్ధి. మరి శిరసుపైన మయూర పింఛమూ ముఖంలో మందహాసమూ, ఆశ్రితుల మీద దయారసాన్ని చిందించటమూ, కృష్ణుడికి సహజ లక్షణాలే. చెల్వల మాన ధనాన్ని చూఱలాడటమూ వారి నేడిపించటానికి మాయమై పోవటమూ కూడా సహజమే ఆ రసికా వతంసుడికి.

  పోతే అది కూడా కాదు కవి వివక్షితం. ఈ కృష్ణ వర్ణనలో కూడా దాగి ఉన్న ధ్వనిస్తున్న ఒకానొక పరతత్త్వ భావన. అదీ మనం పరిశోధించి పట్టుకోవలసిన ఆధ్యాత్మిక రహస్యం. ఏమిటది. నల్లనివాడు. గగనంలాగా నల్లని దాతత్త్వం. గగనం దూరానికి నల్లగానే కనిపిస్తుంది. కాని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ నలుపక్కడ లేదు. అది ఒక దృగ్రమ. వస్తువులో లేని గుణం మన దృష్టి ఆరోపిస్తున్నది. అలాగే పరమాత్మకు వాస్తవంగా ఏ గుణమూ లేదు. ఏ రూపమూ లేదు. ఆయన నొక కృష్ణుడని రాముడని మన మూహిస్తున్నా మొక రూపంలో. మరి పద్మ నయనంబుల వాడు. నిర్గుణడైనా నిరాకారుడైనా ఆయన తన మాయాశక్తిచేత ఈ సృష్టినంతా తయారుచేసి దీన్నిలా నడుపుతున్నాడు. నయనమంటే నడపటమే. పద్మాలీ బ్రహ్మాండ భాండాలు. మండలాకారంగా ఉన్నాయివి. ఆది మధ్యాంతాలు మూడు ఒక్కటే. వేటికవి తానే. తన స్వరూపమే అది. పైపైన మనకందని సీమలో ఉండే ఆ రసాన్ని మనపైన చల్లుతున్నాడు. మనకందిస్తున్నాడు. అయితే మనమందుకోలేకపోతున్నాము. కారణం మౌళి పరిసర్పిత పింఛము వాడు. ఆయన మౌళిగాదిది మన మౌళి. మన బుద్ధులచుట్టూ తిప్పుతున్నాడు తన మయూర పింఛాన్ని. అది రంగు రంగుల పింఛం. “అజామేకామ్ లోహిత శుక్ల కృష్ణామ్" త్రివర్ణాలంటే త్రిగుణాలే. త్రిగుణాత్మక అయిన మాయే అది. అది త్రిప్పితే తిరుగుతున్నాయి మన బుద్ధులు. ఈ పరిభ్రమించే బుద్ధుల కా శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన తత్త్వమెలా బోధ పడుతుంది. అందుకే నవ్వురాజిల్లెడు మోమువాడు. అది మీ స్వరూపమై కూడా మీరు గ్రహించలేకపోయారే పైగా ఎక్కడో దూరంగా దాగి ఉందని వెతుకుతున్నారే ఏమిటి మీ అవివేకమని పరిహసించట మది. అదేమిటి పరమాత్మ ఈ జీవాత్మ ఎలా అవుతాడని అడిగితే

Page 158

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు