
వారు రావటానికి సంకోచిస్తుంటే కృష్ణుడు వారిని చూచి అనే వాక్యాలు వినండి ఎలాంటి అర్థమిస్తున్నవో.
“శృంగార వతులార సిగ్గేల మిముగూడి పిన్న నాటను గోలె పెరిగినాడ ఎఱుగనే మీలోన నెప్పుడు నుండుదు - నేనెఱుంగని మర్మమేమి గలదు"
పైకి చూస్తే ఇది పరమబూతు. కాని లోతుకు దిగి చూస్తే అంతా తాత్త్విక రహస్యమే. “ఈశ్వర స్సర్వభూతానా” మన్నట్టు అందరి హృదయాలలోనూ ఉన్నదా తత్త్వం. అది మనం పుట్టినప్పటి నుంచీ మనలో చోటు చేసుకొనే ఉంది. నిజంలో దానికి తెలియని మర్మం మనలో ఏమున్నదని. ఇక అది మన స్వరూపాన్ని చూచిందని సిగ్గు పడటమెందుకు. మన స్వరూపమే అది గదా ఎంత వేదాంతార్థమో చూడండి.
ఈ గోపికలు నగ్నంగా జలకాలాడటమూ - గట్టున వారి చీరలుంచటమూ అవి కృష్ణుడెత్తుకొని పోవటమూ, ఈ సన్నివేశం ఒక ప్రతిబింబమైతే దీనికి బింబభూతమైన సన్నివేశం మనకు భాగవతారంభంలోనే కనిపిస్తుంది. శుకమహర్షి ముందు పోతుంటే వ్యాసుడతని వెంటబడి పోతున్నపు డప్సరసలు దారిలో ఒక సరోవరంలో ఇలాగే జలకమాడుతుంటారు. నీళ్లమీద నగ్నంగా ఈదుతున్నారో, తేలుతున్నారో శుకుడు పట్టించుకోలేదు. అటు చూడను కూడా లేదా యోగీశ్వరుడు. అదే వ్యాసుడటు బయలుదేరి వచ్చేసరికి వారు హడావుడిగా వచ్చి వస్త్రాలు ధరిస్తారు. వ్యాసుడది తనకవమానంగా భావించి అడిగితే వారాయన కిచ్చిన సమాధానమేమిటి. మనకు తెలుసును గదా. సరిగా అలాంటిదే ఇక్కడ కూడా సమాధానం. యోగేశ్వరుడైన శుకుణ్ణి చూచే అప్సరసలు భయపడకుంటే యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుణ్ణి చూచి మాత్రం భయపడటం దేనికి గోపికలు. ఈ గోపికలా అప్సరసలే గదా వాస్తవంలో. వారే గదా ఈ రూపాలతో జన్మించారు భగవత్కైంకర్యం కోసమని.
అంచేత గోపికా వస్త్రాపహరణమూ కాదు. వారితో రాసక్రీడాదులూ కావవి. జీవుల అభిమాన ధనాన్ని అపహరించటమే వస్త్రాపహరణం. విశుద్ధ సత్త్వులైన ఆ జీవులకు తన సాయుజ్యాన్ని ప్రసాదించటమే రాసక్రీడ. “రసోవైసః” రస స్వరూపుడు పరమాత్మ. జీవుడూ రసస్వరూపుడే. వారి అన్యోన్యాత్మ భావమే రాసక్రీడ. గోపిక లెప్పుడో గ్రహించా రీరహస్యాన్ని. గోపికలు గ్రహించారో లేదో గాని పోతన
Page 156
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు