స్వామీ మీరిలాంటి మాటలనకండి. మేము వినలేము. ప్రాపంచికమైన సర్వ విషయాలూ పరిత్యజించి మీ పాద మూలాన్ని సేవించటానికి వచ్చాము. మీరు మమ్ముల్ను విడిచి పెట్టకండి. ఆది పురుషుడు తన్నాశ్రయించిన ముముక్షువులను రక్షించినట్టు మమ్ము రక్షించండి. “పతులన్ బిడ్డల బంధులన్ సతులకున్ పాటించుటే ధర్మ పద్ధతి యౌ నంటివి దేహ ధారిణులకున్ ధర్మజ్ఞ చింతింపుమా పతిపుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీయందు - తత్పతి పుత్రాదిక వాంఛలం జలిపి సంభావించుట న్యాయమే” అని జవాబిస్తారు. అప్పుడు యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుం డాత్మా రాముండై వారలతో రమించాడట.
ఈ ప్రశ్నోత్తరాలను మనం బాగా పరిశీలించి చూస్తే భాగవత హృదయమేదో చక్కగా తేటపడుతుంది. అసలీ ప్రశ్నలూ లేవు. ఉత్తరాలూ లేవు. ఇది భాగవత కథలో వేసినవి కావు. కథ వినే మనలాటి పాఠకులు వేసే ప్రశ్నలివి. మనబోటి వారికి పురాణ ఋషి ఇచ్చుకొనే సమాధానాలవి. ఋషి అంటే క్రాంతదర్శి అని గదా చెప్పాము. క్రాంతదర్శి గనుకనే భూత భవిష్యద్వర్తమానాలలో ఏ కాలంలో మానవుడి కెలాటి సంశయం రావచ్చునో ముందుగా ఊహించి తానే సమాధాన మిస్తాడు. అలాగైతేనే దానిమీద మానవులకు విశ్వాస మేర్పడుతుంది. పరిపూర్ణమైన విశ్వాసం కుదిరితేనే గాని సాధన మార్గంలో పయనించలేడు మానవుడు. కనుకనే ఆయా కథా సన్నివేశాలు కల్పించి మనకు కలిగే ఆశంకలన్నింటినీ పరిహరిస్తూ పోతాడు మహర్షి. ఇక్కడ జరిగిన పరిహారమేమిటని అడగవచ్చు. గోపికలు కృష్ణుడని మనం బాహ్యార్థం తీసుకొని బాధపడుతున్నాము. ఆంతర్యాన్ని పరిశీలిస్తే అసలు గోపికలూ లేరు. కృష్ణుడూ లేడు. పురాణ కథలన్నీసంకేతాలనే విషయం మనం మరచిపోరాదు. సత్యాని కల్లుకున్న సంకేతమే కథ. సత్యమేమిటిక్కడ. గోపికా కృష్ణులంటే జీవేశ్వరులు. వారి రాసక్రీడాదులు జీవేశ్వరుల తాదాత్మ్యమే. గోపికా విరహమనేది ఈశ్వర సాయుజ్యం కోసం జీవుడు పడే వేదన. మరి కృష్ణుడు వారిని నిష్ఠూరంగా మాటాడటం ఉన్నట్టుండి తిరోహితుడయి పోవటం మరలా సాక్షాత్కరించటం ఇవన్నీ జీవుల కీశ్వరుడు పెట్టే పరీక్షలే. దానికి తట్టుకొని నిలిచామన్నప్పుడే వారికా ఈశ్వరానుగ్రహ లాభం. ఈ రహస్య భావమే శుకుడి మాటలలో చివరకిలా చాటుతాడు మహర్షి "గోప జనములందు గోపిక లందును
Page 154