#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

అడుగులో అడుగు వేసుకొంటూ కోట దాటి వెళ్లి పోతుంటాడు. వారు గమనించి వెంటబడి తరిమితే వాణ్ణి ఎలయించుకొంటూ పోయి ఒక కొండ గుహలోకి జొరబడుతాడు. వాడూ జొరబడి చూడబోతే ఎక్కడా ఐపులేడు. ఇంతలో వాడి ఎదుట ఒక ఆజానుబాహుడైన పురుషుడు పడుకొని గురకపెట్టి నిద్రపోతుండటం చూస్తాడు. వాడే కృష్ణుడనుకొని కాలితో తన్నుతాడు. అతడెవరో కాదు. ముచికుందుడు. కోపంతో అతడు కండ్లు తెరచి చూడగానే వీడు నిలువునా భస్మమై నేల రాలుతాడు. ఏమిటీ సన్నివేశం. కాలయవనుడు వాడు. కాలం తీరితేగాని చావడు. తీరిందప్పటికి. దానికి నిమిత్తమయ్యాడు తన భక్తుడు ముచికుందుడు.

  మరొక కథ శ్యమంతకోపాఖ్యానం. సూర్యోపాసన చేసి సత్రాజిత్తు సంపాదించిందా శ్యమంతకం. అపురూపమైనదే గాక అది ఎన్నో బారువుల బంగారాన్ని ప్రసవిస్తుంది ప్రతిదినమూ, దానిని వద్దంటున్నా మెడలో ధరించి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటకు పోతాడు. అడవిలో వేటాడుతుంటే ఒక సింహం వచ్చి వాణ్ణి వధిస్తుంది. దాన్ని వధించి భల్లూకరాజు జాంబవంతు డామణిని తీసుకొని తన నివాసానికి పోయి కూతురు జాంబవతికిస్తాడు. ఇది ఇలా జరిగిందని తెలియక సత్రాజిత్తు కృష్ణుడే తన తమ్ముని చంపి మణి నపహరించాడని పుకారు పుట్టిస్తాడు. అది పాపుకోటానికి కృష్ణుడు స్వయంగా అడవికి పోయి జాంబవంతుని అడుగు జాడలను బట్టి అతని గుహలో ప్రవేశించి అతనితో యుద్ధం చేసి ఓడిస్తాడు. జాంబవంతుడాయన తన ఇష్టదైవమే నని గ్రహించి కన్యారత్నాన్నీ ఇచ్చి పంపుతాడు. అది తెచ్చి సత్రాజిత్తు కిస్తే అతడు సిగ్గపడి క్షమాపణ చెప్పుకొని తానూ తన కన్యనూ శ్యమంతకాన్నీ రెండింటినీ అప్పగించి బహుమానంగా సాగనంపుతాడు. చూడండి ఎలాంటి మనోహరమైన సన్నివేశమో ఇది. ఎంతవారికైనా అపవాదు తప్పదని మనమింతవారం కదా అని తామసించక నెమ్మదిగా దాన్ని తొలగించుకొనే యత్నం చేయాలని చేస్తే వచ్చిన అపవాదు పోవటమే గాక అనేక విధాల లోకుల మెప్పుకూడా పడయవచ్చుననీ ఎంత గొప్ప సందేశమో ఉంది. ఇలా మానవోచితంగా ప్రవర్తించటంలో కూడా తన దివ్య సందేశంతో లోకుల ఉద్ధరణకే బద్ధకంకణుడవుతాడు పరమాత్మ.

  ఇంతకన్నా అతీతమైన దివ్యసందేశ మందించాడాయన గోపికలతో చేసిన విహారంలో. దీనిలో ఎంత దివ్యత్వముందో దానికి భిన్నంగా అంత దుర్విమర్శకు

Page 152

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు