ఎక్కడికి పోతుంది. కనుకనే పూర్ణకాముడైన పరమాత్మనే పరీక్షించాలని వచ్చాడు. ఎంత గంభీరమైన మాటో ఇది.
ఇలా శిష్టులను కూడా శిక్షిస్తూ వచ్చాడు భగవానుడు. అది వారి కప్పుడప్పుడు కలిగే అహంకారాన్ని అభిమానాన్ని చాపల్యాన్ని పోగొట్టి పరిశుద్ధమైన సత్త్వగుణాన్ని వారికి ప్రసాదించి తత్త్వప్రబోధం చేయటమే తప్ప మరేదీగాదు అందులో కూడా ఒక చమత్కారముంది. సహజంగా పామర స్వభావులైన వారికందరికీ అలౌకికమైన మహిమలు ప్రదర్శిస్తాడు. మరి వివేక విజ్ఞానవంతులైన పెద్దలకు అలాటి లీలలేవి ప్రదర్శించకుండా మామూలుగానే వ్యవహరిస్తాడు. యశోదాదులకు విశ్వరూపాది లీలలు చూపటమూ, భీష్మవిదురాదుల కవి ఏమీ చూపక సహజంగా కనిపించటమూ గమనిస్తే తెలుస్తుంది. అది ఒక లీలా భేదం. తెలిసినవారికి నిదర్శనమక్కరలేదు. తెలియని వారికే కావాలది. ఏదో అలౌకికమైన దృశ్యం చూపితే గాని వారికి విశ్వాస మేర్పడదు. అందుకే ఈ ప్రదర్శన. ఒకప్పుడు తెలిసినవారు కూడా వ్యామోహంలో పడవచ్చు. అప్పుడు వారికి మరలా జ్ఞానోదయం కలిగించటానికి కూడా పనికి వస్తుంది ప్రదర్శన.
మరొకప్పుడు తనకన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు కేవల మానవ మాత్రుడుగా వ్యవహరించడం కూడా కద్దు. అది కూడా ఒక లీలా భేదమే. మనకెంత శక్తి సామర్థ్యాలున్నా ప్రయోజనం లేదు. అది ఫలించటానికి కూడా ఒక కాలమంటూ ఉంది. ఏది ఎప్పుడెలా జరగాలో దానికెవరు నిమిత్తం కావాలో అది విశ్వ నియామకమైన ఒకానొక శక్తివల్లనే ఏర్పడుతుందా ప్రణాళిక. ఎంతవాడైనా దాని ననుసరించి పోవలసిందేనని మాటలతో గాక చేతలద్వారా తన జీవితానికే అన్వయించి లోకులకు చూపటమెంత చమత్కారం. లేకుంటే జరాసంధుణ్ణి తాను వధించలేనివాడా. అతడు తరుముతూ పోతే ఇరువది మార్లు పరుగెత్తి పోవటమేమిటి. అందుకోస మన్నివైపులా ద్వారాలూ, కవాటాలూ గల ఒక పట్టణాన్ని నిర్మించుకొని కాపురముండటమేమిటి. అది ఒక నటన. కాలాంతరంలో భీముడిచేత చంపించి పాండవుల కా ప్రతిష్ఠ దక్కించాలనే ఈ ఉపేక్ష. కాలయవనుడనే రాక్షసుడిరువది ఒక్క దినాలు తన కోట ముందు పాగావేశాడు తాను బయటికి వస్తే పట్టుకోవాలని. వాడి ధాటికి భయపడినట్టుగా లోపల దాగి ఉండి సమయం రాగానే మెల్లగా
Page 151