#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

స్వామి వారి మీద పుష్పవర్ణం కురిపిస్తారు. దీనిని బట్టి గ్రహించవలసిన సత్యమేమంటే సృష్టించటానికి గాని, రక్షించటానికిగాని సకల శక్తి సంపన్నుడైన పరమాత్మకు తప్ప మరెవ్వరికీ ఆ అధికారం లేదు. ఇంద్రాది దేవతలు ఆయా అధికారాలలో ఉన్నా వారి అధికారాలు పరిమితమే. అది తెలిసి మెలగితే వారు వివేకవంతులు, లేకుంటే వారికైనా గర్వభంగం కాక తప్పదు. తమ కార్యం కోసమే పరమాత్మ అవతరించాడని తెలిసి దేవకీ గర్భంలో ఉండగానే వచ్చి ఆయనను స్తుతించిన వారయికూడా బ్రహ్మాదు లహంకరించారంటే అది ఎంతటి అవివేకమో గదా. అలాటి అహంకారం మానవులకెలా పనికిరాదో దేవతలకూ పనికిరాదు. కేనోపనిషత్తులో ఇలాటిదే ఒక ఆఖ్యాయిక వస్తుంది. పరమాత్మ అనుగ్రహంవల్ల కలిగిన విజయం తమ విజయంగా భావించి గర్వించారు దేవేంద్రాదులు. అప్పుడు వారికంతు పట్టని ఒక అద్భుతాకారం సాక్షాత్కరించి అగ్ని వాయ్వాది దేవతలకు గర్వభంగం చేసి వారికి కనువిప్పు కలిగిస్తుంది. అలాటి నేత్రోన్మీలనమే ఇక్కడా జరిగింది బ్రహ్మాదుల విషయంలో

  పోతే నారదాది మహర్షులను కూడా పట్టి చూస్తాడు భగవానుడు. పదహారువేల రాజ కన్యలతో ఎలా విహరిస్తాడో ఆయన వైభవాన్ని పరీక్షించి చూడాలనే కుతూహలంతో బయలుదేరిపోతాడు నారదుడు ద్వారకా నగరానికి. వెళ్లి చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరులో సాక్షాత్కరిస్తాడు శ్రీకృష్ణుడు. “తత్రాస్యా చష్ట గోవిందం లాలయంతం శిశూన్ సుతాన్” ఒకచోట పిల్లల నాడిస్తుంటాడు. తతో న్యస్మిన్ గృహే 2 పశ్య న్మజ్జనాయ కృతోద్యమమ్ - ఒకచోట స్నానానికి లేవబోతుంటాడు. క్వాపి సంధ్యా ముపాసీనమ్ జపంతం బ్రహ్మ వాగ్యతం- ఒకచోట గాయత్రి జపిస్తూ సంధ్యా వందనం చేస్తుంటాడు. మంత్ర యంతంచ కస్మింశ్చి న్మంత్రి భిశ్చోద్ధ వాదిభిః మరొకచోట ఉద్ధవాదులైన మంత్రులతో మంత్రాంగం నడుపుతుంటాడు ఇలా ఒకటని లేదు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కృష్ణవిగ్రహం సాక్షాత్కరించే సరికి మతిపోతుంది నారదుడికి. పైగా ఆయన కెదురువచ్చి భగవానుడు తాము పూర్ణకాములై అపూర్ణకాముడనైన నన్ను దర్శింపవచ్చారా అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలోనే ఉన్నదెంతో మర్మం. పూర్ణకాముడు పరమాత్మ. ఆయన కుండగూడదిక ఏ కోరికా. అయినా అన్నీ అనుభవిస్తూ కనిపిస్తున్నాడు తాను. అపూర్ణ కాముడు నారదుడు. అయినా పూర్ణకాముడిలాగా పైకి కనపడుతున్నాడు. పైకలా కనపడుతున్నా కుతూహలం

Page 150

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు