#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

"కిమ్మయా హతయా మంద” ఒరే నన్ను చంపి ఏమి ప్రయోజనంరా మూఢుడా, "జాతః ఖలు తవాంత కృత్" నిన్ను చంపే మహానుభావుడొక డీపాటికే జన్మించి ఉన్నాడు. తెలుసుకో అని కంసుణ్ణి హెచ్చరించి మాయమవుతుంది. చూడండి. జన్మించాడని చెబుతుంది గాని ఎక్కడ జన్మించాడో ఎవడో చెప్పదు. ఇదే మాయ అంటే. తెలిసీ తెలియనిదే మాయ. అసలు తెలియక పోలేదిప్పుడు కంసుడికి కొంత తెలిసిందా మాటలవల్ల. కాని పూర్తిగా తెలియలేదు. వాడికి మనోవ్యథ అయింది. అది భేదించే వరకూ వాడికిక నిద్రాహారాలు లేవు. ఇదే మనగతి కూడా. మృత్యు రహస్యాన్ని భేదించేదాకా మనకూ మథన తప్పదు.

  అయితే చిత్రమేమంటే తనకు మృత్యువుందని తెలియక తానే మృత్యువునని భ్రమపడ్డాడు కంసుడు. కాలనేమి గదా కంసుడు. కాలనేమి కాలచక్రమే. కాలమే చక్రాకారంగా తిరుగుతూ ప్రాణులందరినీ పొట్టన పెట్టుకొంటున్నది. అదే కంసుడు చేసిన పని. కనపడ్డ బిడ్డలనందరినీ వధించమని ఆజ్ఞాపించటమదే. తిరుగులేని తన ఆయుధాన్ని భగవంతుడి మీద కూడా చివరకు ప్రయోగింపచూచాడు. ఇదే తెలివితక్కువ. కాలాతీతమైన తత్త్వాన్ని కాలమేమి చేయగలదు. అయినా తన ప్రయత్నం మానదది. గిర్రుమని తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడూ ఏదో ఒకటి భయంకరమైన అనర్ధం మన మీద విసురుతూనే పోతుంది. కంసుడు కూడా విసిరాడలాటి ఉపద్రవాలు. ఆ విసురులే పూతనా శకట తృణా వర్తాదులు. పూతన వచ్చి చేతన కోలుపోయింది. తృణావర్తుడు గాలి కెగిరిపోయాడు. శకటాసురుడు నడుములు విరిగి నేలకొరిగాడు. బకాసురా ఘాసురులు గతాసువులయ్యారు. వృషభాసురుడు నోరు తెరచి బావురుమన్నాడు. జితాకాశి అయిన కేశి దానవుడు హతకాశి అయిపోయాడు. వ్యోమాసురుడి ప్రాణాలు వ్యోమమార్గాని కెగిరిపోయాయి. ఇలా కాలనేమి తనపై విసిరిన అసుర శక్తులన్నింటినీ కాలగర్భంలోనే కలిపి వేశాడు పరమాత్మ. ఆ కాలం ధరించిన మరొక రూపమే కాళియుడు. అది ఒక సర్పం. కాలసర్పం. కాలమే సర్పరూపంగా దాగిఉంది. ఎక్కడ కాళింది మడుగులో. మడుగు కాదది సంసారమనే మహాహ్రదమే. ఇందులో తెలియక పడ్డ ఎవరినైనా కాలమనేది అంతమొందించేదే. అయితే సర్వమూ తెలిసిన పరమాత్మనది ఏమి చేయగలదు. అప్పటికీ అవివేకంతో చుట్టుకొన్నది. సహస్ర ఫణాలు విప్పి విషం గ్రక్కింది. కాని

Page 146

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు