పృథివ్యాం ద్రవిణం బ్రహ్మ వర్చసమ్ మహ్యమ్ దత్వా" అనే మంత్రోపాసకుల శుభకామన మనకు బాగా వ్యక్తమవుతుంది.
ఈ విధంగా ఈ యోగమాయా వృత్తాంతం గాయత్రీ వృత్తాంతానికి అద్దం పట్టినట్టుగా కనిపిస్తున్నది. భాగవతారంభంలో మనమొక మాట చెప్పుకొన్నాము. వృత్తా సుర వధ - గాయత్రీ మంత్రార్థ వివరణ ఎక్కడ వర్ణించబడతాయో అది భాగవతమని. రెండింటి విషయమూ మొదటి రెండు శ్లోకాలలోనే భంగ్యంతరంగా స్ఫురింపజేశారని కూడా పేర్కొన్నాము. అందులో వృత్రాసుర వధ వృత్తాంతం భాగవత మారవస్కంధంలో సూటిగానే వర్ణించబడింది. పోతే రెండవదైన గాయత్రీ వృత్తాంతమలా సూటిగా ఎక్కడా వర్ణించినట్టు కనిపించదు భాగవతంలో. ఇదుగో ఇక్కడ మనకది భాగవతం ఈ యోగమాయా వ్యాజంతో చాటుగా నిర్దేశిస్తున్నది. నన్ను విరోధం చేసుకొని ప్రయోజనం లేదు. నిజంగా నీకు పరమాత్మ తత్త్వం గ్రహించాలని కోరికే ఉంటే నన్నా లంబనంగా చేసుకో- పరమాత్మ ఎక్కడ ఉన్నాడో నివేదిస్తాను. అలా కాక దూరం చేసుకొన్నావంటే నాకూ పరమాత్మకూ కూడా దూరమవుతావని కంసుడు నెపంగా మనబోటి జిజ్ఞాసు లోకానికంతా చేసే నిగూఢ ప్రబోధమిది.
మొత్తం మీద యోగమాయ హెచ్చరించినట్టుగానే జరిగింది కృష్ణజన్మ. కంసుడి కేమాత్రమూ అంతు పట్టలేదు. అష్టమ గర్భమని తెలియక కాదు కంసుడికి. తెలిసి కూడా ఆ అష్టమమైన గర్భం కృష్ణుడుగా గాక యోగమాయగా దర్శనమిచ్చింది వాడి దృష్టికి. అంతే మరి, రాజస తామసమైన దృష్టితో చూస్తే భగవత్తత్త్వమెలా గోచరిస్తుంది. దానికి మారుగా తదాభాస అయిన మాయే మనకు గోచరమయ్యేది. అలాగే గోచరమయింది కంసుడికి. మాయ కనిపించి మరలా మాయమయింది. పోతే తదా ధారమైన అసలు పదార్థమెక్కడ ఉన్నట్టు. అది ఆ పాటికే దేవకికి జన్మించనూ జన్మించింది. రాత్రికి రాత్రి యశోద వద్దకు చేరనూ చేరింది. అసలది జన్మ అయితే గదా. జన్మ అనుకొంటే జన్మ. కాకుంటే కాదు. నవమాసాలూ దేవకీ దేవి మోసింది ఖాయం. నవమాసాలూ నిండి శిశువు జన్మించిందీ నిజం. కాని పుట్టాడో లేదో వెంటనే పెరిగి పెద్దవాడైన ప్రౌఢ వయస్కుడి లాగా కనిపించాడు తల్లిదండ్రులకు. అది కూడా ఎలాటి రూపంలో కనిపించాడు వారికి.
Page 143