#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

ధర్మాలూ, అస్తమించాయి గదా దీన్ని కాపాడే నాథుడే లేడా అని వాపోతాయవి. ఆ తరువాతనే కలిపురుషుడు వాటిని తన్నటమూ పరీక్షిత్తు వాడి మీద చేయి చేసుకోవటమూ జరుగుతుంది.

  ఏమిటీ ఉదంతంలోని ఆంతర్యం. ఇది ధర్మ భూదేవతల సంవాదం కాదు. తదప దేశంతో సాగిన పరమాత్మ మౌన సందేశం. ఎవరికా సందేశం. ఎవరు దేశానికంతా పాలన భారం వహిస్తే వారికి. వాడు ప్రస్తుతం పరీక్షిత్తే. “నా విష్ణుః పృథివీ పతిః" అన్నారు. విష్ణ్వంశ లేనివాడు ప్రజాపాలకుడు కాలేడు. సృష్టి స్థితి లయాలలో స్థితి కర్త విష్ణువు గదా. ఆ స్థితిని చూడవలసిన వాడే క్షత్రియుడు కూడా. అది నేను లోకంలో అవతరించి చూడవలసినంతగా చూచాను. నలుగురిచేతా చేయించాను. యుగాంతమై నేనిప్పుడు నిష్క్రమిస్తున్నాను. మరి నాతోపాటు ధర్మం కూడా నిష్క్రమించకుండా చూడవలసిన బాధ్యత మీ బోటి క్షత్రియులమీద ఉన్నది. నేనున్నా లేకున్నా చూడాలి మీరు. అలా పరీక్షించి చూచేవాడవు కనుకనే నీ తండ్రి నుపేక్షించినా నేను గర్భంలోనే అంతరించకుండా నిన్ను రక్షించాను. విష్ణురాతుడవైన నీవు విష్ణువులాగా లోకస్థితినెలా కాపాడగలవో మరి - సకల ధర్మ నిర్మూలకమైన కలికాలం వచ్చి పడింది. దీనికేమిటి నీ సమాధానమని పరీక్షిత్తుకు చేసిన పెద్ద హెచ్చరిక ఇది. అందుకే జన్మ వృత్తాంతమింకా ప్రస్తావన చేయకముందే పురాణా రంభంలోనే కృష్ణ నిర్యాణ వార్త వినిపిస్తున్నాడు బాదరాయణుడు. ఈ విషమమైన కలికాలంలో బ్రతికే రాజు లేమిటి. ప్రజలేమిటి. ప్రతి ఒక్కరికీ ప్రపంచ పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ అందులో ఎవరి బాధ్యతలు వారెలా నిర్వర్తించాలో తద్వారా విశ్వ ధర్మ ప్రతిష్ఠాపనకెలా సహకరించాలో చేసే బ్రహ్మాండమైన ప్రబోధమిది. నిర్యాణానంతరం పరమాత్మ చేస్తున్నాడిది మనకు మౌనభాషతో.

  పోతే ఇక ఆయన జన్మ వృత్తాంతమెక్కడో దశమ స్కంధంలోగాని రాదు. నిర్యాణమెంతో కృష్ణుడి జననం కూడా అంత పరమాద్భుతమైన విషయం. అక్కడ కూడా ఆయన సాక్షాన్నారాయణ తత్త్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. భూదేవి దుర్మార్గుల పాపభారం మోయలేనని బ్రహ్మతో పోయి మొరపెడితే ఆయన దేవతలతో సహా క్షీరసాగరానికి వెళ్లి నారాయణమూర్తికి వినకారు చేస్తే ఆకాశంలో ఆయన కొక వాణి వినిపిస్తుంది. అది విని బ్రహ్మ వారితో ఇలా అంటాడు

Page 138

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు