ధర్మానికి ప్రహ్లాదాదులైన భాగవతులు. కనుక దానవోద్రేకస్తంభకుడై తద్ద్వారా భక్తపాలన కళా సంరంభాన్ని చూపవలసిన వాడయ్యాడు. నిజానికది సంరంభమే గాదు. ఆయన పాలిటికది ఒక లీల. మనకోసం ప్రదర్శించే ఒక కళ. ఎందుకంటే అసలీ దుష్టులూ లేరు శిష్టులూ లేరు - ఆయన శిక్షించటానికీ, రక్షించటానికీ. అధర్మమూ లేదు, ధర్మమూ లేదు ఆయన లోకస్థితిని కాపాడటానికి. అంతా మిథ్యా - మాయ. ఇదంతా ఒక నాటకం. యత్ర త్రిసర్గోమృషా అని మొదటనే ఘోషించింది భాగవతం. సృష్టే మృష అయినప్పుడా సృష్టిలోని దేవ దానవ జాతులూ, వారి మంచి చెడ్డలూ, వాటి కోసం భగవదవతార సంరంభమూ ఇదంతా సత్యమెలా కాగలదు. అది మృష అయితే ఇది ఒక మిష అనే అనుకోవాలి మనం. అదే వ్యంగ్యంగా బయట పెడుతున్నాడు మహాకవి కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకుడనే మాటలో. ఈ బ్రహ్మాండ భాండాలన్నీ ఆయన ఒక కుమ్మరిలాగా దండమూ, చక్రమూ, సూత్రమూ పెట్టుకొని సృష్టించలేదు. ఈ సృష్టి ఆయన దృగ్జాల సంభూతమట. దృగ్జాల మేమిటి. దృక్కేజాలం. దృక్కంటే దృష్టి. జాలమంటే మాయ ఇంద్రజాలమనే మాటలో తెలుస్తుంది మనకు. జాలమంటే కేవలం మాయ. తనచైతన్య రూపమైన దృక్కును నిరంతరమూ ఆశ్రయించి ఉన్న ఏ మాయాశక్తి ఉందో తద్వారా ఆవిర్భవించిందీ సృష్టి అంతా. అంతేగాని వాస్తవం కాదిది. అద్వైతులు చెప్పే దృష్టి సృష్టి వాదమిది. తన సృష్టే ఇలా అయథార్థ మయినప్పుడు తాను జన్మించటం మాత్రమిక యథార్థమెలా కాగలదు. కనుకనే నందాంగనకు డింభకుడుగా కనిపిస్తున్నా అది “మహాంతం విభు మాత్మాన” మన్నట్టు మహద్రూపమే విభూతే. అయినా అసత్యమైన ఈ సృష్టి సత్యంగా భాసింపజేస్తున్నాడు. అజాతుడైనా తానొక నంద యశోదలకు జన్మించినట్టు భాసిస్తూ వచ్చాడు. ఇదొక కేళి ఆయన పాలిటికి. ఆ కేళిలో లోలుడయి దాని ఫలితంగా ఇంత పెద్ద నాటకం మనకొక ఇంద్రజాలంలాగా చూపుతున్నాడు.
ఇదీ కృష్ణావతార తత్త్వాన్ని గూర్చి మహాకవి అర్థం చేసుకొని మనకు చేసిన బోధ. మనం కూడా అలాగే అర్థం చేసుకోవాలాతత్త్వాన్ని. అసలు భాగవత ముద్దేశించింది కూడా అదే. "సర్వే ప్యంశ కలా విష్ణోః కృష్ణస్తు భగవాన్ స్వయమ్” అని మొదటనే చాటుతున్నది భాగవతం. మిగతా మత్స్యకూర్మాదులన్నీ అంశ కళలేనట
Page 135