కాబట్టి రాముడింతకూ లోకులకు ధర్మోపదేశం మాత్రం చేయవలసిన వాడు గనుక ఆయన జీవితం తావన్మాత్రంగానే సాగింది. పోతే కృష్ణుడు ధర్మోపదేశం కోసం కాదవతరించింది. ఆయన లోకులకు పరమ పురుషార్థమైన మోక్షఫలాన్నే అందివ్వాలని వచ్చాడు. కనుకనే రామాయణ మితిహాసమైతే భాగవతం పురాణమయిందని ఇంతకుముందే మనవి చేసి ఉన్నాను. మోక్షపురుషార్ధమే భాగవతానికి వివక్షితమైతే తత్ప్రదాత శ్రీకృష్ణుడే దానికి కథానాయకుడయ్యాడు. కృష్ణ చరితమనే భాగవతానికి నామధేయం. కృష్ణతత్త్వమే ఈ పురాణ పారిజాతానికి మూలం. తత్తత్త్వవేత్త తదంశ సంభవుడూ అయిన కృష్ణ ద్వైపాయనుడే ఆ మహత్త్వాన్ని లోకుల కందివ్వగలిగాడు. అది శుకముఖంగా ఆకర్ణించి తరించినవాడూ కృష్ణ రక్షితుడై కృష్ణ స్మరణైక పరాయణుడైన పరీక్షిత్తే. మొత్తం మీద అంతా కృష్ణమయ మీ పురాణం. ఇది గుర్తించే పైకి రామభక్తుడని పేరు వడసిన పోతన కూడా కలంచేత బట్టి వ్రాత కుపక్రమించినప్పుడే కృష్ణ గుణ సంకీర్తనతో ఉపక్రమించాడు.
శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ - లోకర క్షైకారంభకు - భక్తపాలన కళా సంరంభ కున్ - దానవో ద్రేకస్తంభకు - కేళిలోల విలస దృగ్జాల సంభూత నా నాకంజాత భవాండ కుంభకు - మహానందాంగనా డింభకున్
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించిం దాయన ఎవరినో గాదు. కృష్ణ పరమాత్మనే. ఆయన నందాంగనా డింభకుడు. డింభకుడని పేరేగాని మహాడింభకుడు. మహాడింభకుడేమిటి - పెద్ద కుర్రవాడన్నట్టు. పెద్దవాడా కుర్రవాడా ఇంతకూ. కుర్రవాడుగా మనకంటికి కనిపిస్తున్నాడే గాని నిజానికి కుర్రగాదు. పెద్దే. పెద్దంటే మామూలు పెద్దగాదు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే ఉపనిషద్వాక్యానికిది ప్రతిధ్వని. అణువుకన్నా అణువూ మహత్తుకన్నా మహత్తు కూడా అది. అదే మహాడింభకుడని చమత్కారంగా అన్నాడు మహాకవి.
పోతే ఇక ఈ పద్యంలో చేసిన వర్ణన అంతా కృష్ణావతార వర్ణనే. లోక రక్షైకారంభకు డాయన. లోక రక్ష ఎలా ఏర్పడుతుంది. అధర్మ విజృంభణా ధర్మ విప్లవమూ సాగినంతవరకూ అది సంభవం కాదు. అధర్మానికి ప్రతీక దానవులైతే
Page 134