#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

  ఇలా వర్ణించాము గదా అని రాముడు కేవలం మానవమాత్రుడే నని గాదు మనం భావించవలసింది. భగవదవతారమైనప్పుడేది కానీ దివ్యం కావలసిందే కాని మానుషమెలా అవుతుంది. ఆ మాటకు వస్తే రాముడు కూడా పరిపూర్ణుడే. కృష్ణుడిలాగా అదీ విభవావతారమనే గదా పేర్కొన్నాము. విభవ మన్నప్పుడు పరిపూర్ణం కాక అది అపరిపూర్ణమెలా అవుతుంది. అయితే ఎటు వచ్చీ ఆ వైభవం ప్రదర్శించ లేదా అవతారంలో పరమాత్మ “ఆత్మానమ్ మానుషమ్ మన్యే” అని స్పష్టంగా చెప్పుకొన్నాడు తన మనుష్య భావాన్ని. అంటే తన వైభవాన్నంతటినీ కావాలని కప్పి పుచ్చుకొని తనది కాని మానవత్వాన్ని తనకు సహజమైనట్టు లోకానికి చూపుతూ వచ్చాడన్న మాట. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఆ అవతారంలో ఈశ్వరుడు చేయదలచిన మానవోద్ధరణ ధర్మోపదేశంతో, మోక్షపదేశంతో కాదు. కనుక మహిమ చూపవలసిన అవసరం లేదు. ఒక ఉత్తమ మానవుడెలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో చూపితే చాలు. అలాగే భావించాడు. చెప్పాడు. చూపాడు రాముడు. ఎక్కడా తాను భగవానుడనని ఆచూకీ ఇవ్వలేదు. అది లోకుల కవసరం కూడా లేదు. ఇదీ రాముడు చేసిన పని. కనుకనే వాల్మీకి ఆయన కెక్కడా భగవాన్ అనేమాట వాడలేదు. పురుషోత్తమః రాజపుత్రః, దాశరథిః కౌసల్యానందవర్ధనః, రఘునందనః అని మాత్రమే వ్యవహిరించాడు. కాని మనం గ్రహించవలసిందేమంటే కవి అయిన వాల్మీకికీ తెలుసు కథా నాయకుడైన రామచంద్రుడికీ తెలుసు ఒక విషయం. రాముడు భగవంతుడే నని వాల్మీకికీ తెలుసు. తాను భగవంతుడే నని రాముడికీ తెలుసు. తెలిసే ఆయన తెలియనట్టు ప్రవర్తిస్తే- ఆ ప్రవర్తనలో దాగి ఉన్న తెలివిని తెలియనట్టే బయటపెట్టాడు వాల్మీకి. అది రామాయణం పైపైన చూచిన వారికెవరికీ అంతుపట్టేది కాదు. లోతుకు దిగి ప్రతిమాటా ప్రతిచేతా తడవి చూచి ముందు వెనుకలు బాగా అనుసంధించుకోగల మేధావంతుడి కాకథలో అంతర్వాహినిగా ప్రవహించే మర్మమేదో స్ఫురిస్తుంది. దానితో అడుగడుగునా భాగవతంలో మాదిరి రామాయణంలో కూడా భగవద్విభూతే మన మనోనేత్రానికి సాక్షాత్కరిస్తుంది. ఇది నేను దీని తరువాత వ్రాయబోయే రామాయణ రామణీయక మనే గ్రంథంలో సవిస్తరంగా మనవి చేస్తాను సహృదయ లోకానికి, అలమిహ బహు ప్రపంచనేన.

Page 133

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు