వారి వేషభాషల దగ్గరి నుంచీ ప్రవర్తన దగ్గర నుంచీ మనకు తార్కాణమయ్యే వ్యవహారం. రాముడు కేవలం ధనుర్బాణాలూ రాజోచితమైన వస్త్రాలంకారాలూ, కిరీటాదులూ ధరించి తిరిగితే కృష్ణుడు పీతాంబరమూ వనమాలా కిరీటమూ, కౌస్తుభమూ ఇలాటి చిహ్నాలన్నీ ధరించేవాడు. మయూర పింఛమూ, వేణువూ ఇవి రెండు కూడా విశేషం. ఇంకొక విశేష మేమంటే రాముడికి చతుర్భాహువులు లేవు. అతడు మనలాగా ద్విబాహుడే. కాని కృష్ణుడు ద్విభుజుడుకాదు. చతుర్భుజుడు. ఇలాటి రూపం అది విష్ణువుకు తప్ప ఆయన అవతారాలలో దేనికీ లేదు. అది కృష్ణావతారానికే సంక్రమించింది. అంతేకాక గరుత్మంతుడు రాముడి కెప్పుడో నాగపాశచ్ఛేదన చేయటానికి యుద్ధరంగంలో మాత్రమే దర్శనమిచ్చాడు. మరలా మాయమై పోయాడు. కృష్ణుడితో జీవితాంతమూ ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే పలుకుతాడు. ఎక్కడికి బయలుదేరాలన్నా గరుత్మంతుడి మీదనే ప్రయాణం. సముద్రం దాటటానికి రాముడు బ్రహ్మ ప్రయత్నం చేయవలసి వచ్చింది. అతడు దారి ఇవ్వలేదు సేతువు కట్టి వెళ్లారు వానరులు. మరి కృష్ణుడికైతే అడుగులకు మడుగు లొత్తుతూ ఆయన పోయినంత దూరం శిలారూపంగా మారిపోతాడు. రాముడి రథం భూమిమీద పోవటమే దుర్లభమైతే కృష్ణుని రథం దారుకుడి ప్రమేయం కూడా లేకుండా సప్తకుల పర్వతాలమీద కూడా ఎగిరిపోతుంది. రాముడొకే ఒక రూపంలో కనపడితే కృష్ణుడొక్కొక్కరి కొక్కొక్క రూపంలో ఏక కాలంలో దర్శనమివ్వగలడు. విశ్వాన్ని తాను చూడవలసిందే గాని విశ్వరూపం చూపే ప్రసక్తే లేదు రాముడికి కృష్ణుడు తన జీవితంలో నాలుగుసార్లు చూపాడు విశ్వరూపాన్ని. ఇలా ఎన్నుతూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు. చివరకు రాముడొకరి కుపదేశం చేసిన సందర్భమంతగా లేదు. చాలా తక్కువ. అదీ ధర్మోపదేశమే గాని మోక్షోపదేశం చేయలేదెక్కడా. కృష్ణుడలా కాక తన ఆశ్రితులకూ, బంధువులకూ, స్నేహితులకూ, ఆచార్యులకూ, తల్లిదండ్రులకూ, వీరు వారని లేదు. ఎవరికైనా సరే తత్త్వోపదేశం ఎంతగానో చేస్తూ పోయాడు. అసలు జననం, మరణం, ఈ రెంటిలో కూడా తేడా ఉందిరువురికీ. జీవితంలో ఇక సరే సరి. కృష్ణుడు ప్రతి ఒక్కటీ ముందుగా తెలిసి చేస్తే-రాముడు తరువాత ఏమి జరుగుతుందో తెలియకనే మెలగుతాడు. కడపటి కొకరు ఏక పత్నీ వియోగమే సహించలేక విషాదమనుభవిస్తే మరొకరు బహుపత్నీ వియోగాన్ని కూడా వినోదంగానే తిలకిస్తారు.
Page 132