#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

భగవత్స్వరూపం. పోతే వాసుదేవ సంకర్షణా నిరుద్ధ ప్రద్నుమ్నాదులాయన వ్యూహావతారాలు. అంతః ప్రకృతిలో అభివ్యక్తమైన అంశాలివి. పోతే ఇక పరిశేష న్యాయంగా రెండుజాతులే ఉన్నాయి. అందులో ఒకటి లీల. మరొకటి విభవం. దశావతారాలలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ బలరామ కల్క్యవతారాలనే ఎనిమిది లీలావతారం క్రిందికి వస్తాయి. లీల అంటే ఏమిటి. ఏదో ఒక మహత్తరమైన కార్యాన్ని సాధించటాని కవతరించి ఆ ప్రయోజనం తీరిపోగానే అంతర్హితమై పోవటం. అలాంటివే మత్స్యాద్యవ తారాలు. అయితే పరశురామ బలరాములలా తొలగిపోలేదు గదా అని అడగవచ్చు. అవి కూడా వాస్తవంగా మాటాడితే తొలిగినట్టే. పరశురాముడు రాజస గుణ దూషితమైన క్షత్రియ జాతినంతా నిర్మూలించి ప్రయోజనం తీరగానే తరువాత వచ్చిన శ్రీరాముడికి అధికార మప్పగించి తాను మహేంద్రగిరికి పయనమై పోతాడు. చిరకాల జీవి అని పేరు వడసినా మరుగుపడి ఉన్నవాడే ఆయన. అలాగే బలరాముడు చివరిదాకా జీవించి ఉన్నా కృష్ణుని అంటి పట్టుకొని ఆయన ననుసరించి ప్రవర్తిస్తూ స్వప్రభావం బయట పడకుండా అణిగి మణిగి ఉన్నవాడే. అంచేత అవి ఎనిమిదీ లీలావతారాలలో లెక్కే.

  పోతే ఇక రెండే రెండు మిగిలి ఉన్నాయి. ఒకటి రామావతారం మరొకటి కృష్ణావతారం. ఇవి రెండూ విభవావతారాలు. విభవమన్నా విభూతి అన్నా, ఐశ్వర్యమన్నా ఈశ్వరప్రభావమని అర్థం. "పరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ” అని శ్వేతాశ్వతరం చాటుతున్నది. ఆ ఈశ్వరుడికి స్వభావ సిద్ధంగానే ఒక శక్తి ఉంది. అది పరా. అంటే అన్ని శక్తుల కన్నా అతీతమైన శక్తి అది. ఆ శక్తే వివిధైవ అనేక విధాల చిత్ర విచిత్రంగా భాసిస్తూ పోతుంది. దీనికే విభవమని పేరు. ఇలాటి విభవావతారాలే రామకృష్ణులు. వారిలో విశేషమేమంటే మనుష్యరూపంలో మనుష్యుల మధ్యకు వచ్చి మనుష్యులతో సంబంధం పెట్టుకొని బ్రతికినంత కాలమూ మనుష్యోద్ధరణకే పాటుపడ్డారు.

  ఆ ఇరువురిలో కూడా మరలా ఒక పెద్ద తేడా కనిపిస్తుంది. రాముడు మాయా మానుషుడైతే కృష్ణుడు లీలా మానుషుడు. మానవత్వాన్నే ఎక్కువగా ప్రదర్శిస్తూ భగవత్తత్త్వాన్ని మరుగుపరచిన వాడు శ్రీరాముడు. శ్రీకృష్ణుడలాకాదు. మానవుడి రూపంలో కనిపిస్తున్నా అడుగడుగునా తన భగవత్తత్త్వాన్నే చాటుతుంటాడు. ఇది

Page 131

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు