ప్రతిష్ఠాపన
ఈ నాటి నవలలూ, కథానికలూ కూడా దాని పరిధిని దాటి పోలేవు. తత్ప్రభావాన్ని తప్పించుకోలేవు. ఎందుచేత, నీవెలాటి కథ వ్రాసినా, ఏ పాత్రలను సన్నివేశాలను సృష్టించినా అందులో మంచి చెడులూ, కష్టసుఖాలూ, రాగద్వేషాలూ ఇలాటి ద్వంద్వాల సంఘర్షణకు చోటు లేకపోదు గదా. అందులో చెడో మంచో ఏదో ఒకటి గదా చివరకు గెలుపొందవలసింది. చెడు గెలిచినట్టు చూపావా ప్రాపంచిక విషయాల అనిత్యత్వాన్ని చాటి వాటిమీద లోకులకు వైరాగ్యం పుట్టించటమే అవుతుంది. మంచి జయించినట్టు చూపావా అన్ని మంచి గుణాలకూ ఆశ్రయమైన ఆ విశ్వ చైతన్యాన్నే గుర్తించి దాని నీడలోనే బ్రతుకుతూ జీవిత గమ్యాన్ని చేరమని చెప్పినట్టవుతుంది. ఏది చెప్పినా అది తత్త్వ పర్యవసాయి అయిన మాటే.
అసలు రహస్యమేమంటే తత్త్వమనేది స్వరూపమైతే సాహిత్యమంతా దాని విభూతి అని గదా చెప్పాము. స్వరూపమే సత్యంగాని విభూతి అనేది సత్యం కాదు. అది దాని ఆభాస మాత్రమే. ఒక సువర్ణం నానా విధాభరణాలుగా మారితే అవన్నీ అన్ని సత్యమైన పదార్థాలు కావు. సువర్ణమనేది ఒక్కటే అక్కడ సత్యంగా ఉన్న పదార్ధం. తతిమావన్నీ దాని విలాసాలే విభ్రమాలే. అయితే విశేషమేమంటే సువర్ణంలో కనిపించని ఒక అందమూ, సౌందర్యమూ, వీటిలో కనిపిస్తుంది మనకు. దానివల్ల కలగని ఉపయోగం కూడా వీటివల్లనే కలుగుతుంది. అయితే ఈ సౌందర్యమూ, ఉపయోగమూ ఇవి రెండూ ఆ సువర్ణమనే మూలతత్త్వాన్ని వదలకుండానే కలుగుతున్నాయి. ఇదంతా ఆ సువర్ణం తాలూకు వివిధ రూపాల సౌందర్యమే. వివిధ రూపాల ఉపయోగమే. అంటే ఏమన్న మాట. సువర్ణాన్నే అనేక రూపాలలో దర్శిస్తున్నాము. ధరిస్తున్నాము. ఆనందిస్తున్నాము. ఇదే సౌందర్యమంటే అలాగే ఈ ఆభరణాలెంత సుందరంగా ఉన్నా, ఎంత మనకుపయోగపడుతున్నా ఇదంతా ఆ సువర్ణ వికారమే గదా. ఎప్పటికైనా ఆ సువర్ణంగానే గదా వీటికి విలువ, అని వీటి ననుభవిస్తున్నప్పుడల్లా ఆ సువర్ణస్ఫూర్తి కలుగుతూనే ఉండాలి మనకు. ఇదే ప్రబోధమంటే.
సాహిత్య సృష్టిలో కూడా మనం చూచే సౌందర్య ప్రబోధాలిలాగేనని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. కవి భావనే గదా కావ్య రూపం
Page 13