#


Index

ప్రతిష్ఠాపన

  అయితే ఈ దృష్టి Imagination సృష్టి Creation ఆయా భూమికలలో కూడా జరుగుతూనే వస్తున్నది. వారూ ఆయా రంగాలలో భావన చేస్తూనే ఉన్నారు. వివిధ సాహిత్య ప్రక్రియలను సృష్టిస్తూనే ఉన్నారు. తద్వారా లోకాని కుపదేశిస్తూనే ఉన్నారు. కాని దాని ఫలం ముందు పేర్కొన్నట్టు సాపేక్షమే. పాక్షికమే. నిరపేక్షమూ అనంతమూ అయిన ప్రయోజన సిద్ధి వీటిలో దేనిలోనూ ఆశించలేము. అలాటి సిద్ధి కావాలంటే దానికొక్క, తాత్త్వికమైన దృష్టి తదనుసారిగా చేసే సాహిత్య సృష్టే శరణ్యం. అది ఒక్కటే అయితే మిగతా సాహిత్యమంతా ఏమి కావాలి. దాని గతేమిటని ప్రశ్నించవచ్చు. అది కూడా ఆయా లౌకిక రంగాలలో ప్రయాణం సాగిస్తున్నా, ఎక్కడో ఒక చోట చివరికి తత్త్వసాగరంలో పోయి కలిసినప్పుడే చరితార్ధమవు తుంది. అప్పుడే అది మనకుపాదేయం కూడా అవుతుంది. అంతేగాని ఆది మధ్యాంతాలలో ఎక్కడా కూడా తాత్త్వికమైన స్పర్శ ఏ మాత్రమూ లేని సాహిత్యానికసలు విలువా లేదు. అది సాహిత్యమూ కాదు. ఒకవేళ అది ఎంతో కొంత సౌందర్యమూ, ప్రబోధమూ సాధిస్తే సాధించి ఉండవచ్చు. కాదనటంలేదు. కాని అదంతా మనకు తాత్త్విక దృష్టిలోనే కలిసి వస్తుంది. “యావానర్థ ఉదపానే” అనే గీతా శ్లోకాన్ని గుర్తు చేసుకొంటే సరిపోతుంది. ఒక నదిలో స్నానం చేస్తే చాలు. తటాకంలో చేయనక్కరలేదు. సముద్రంలోనే చేయగలిగితే ఇక నది కూడా అక్కరలేదు. నదీనామ్ సాగరో గతిః అన్నట్టు సకల నదులూ సముద్రంలోనే లీనమయి ఉన్నాయి గదా. అలాగే సకల సాహిత్య ప్రక్రియలూ, వాటి ప్రయోజనాలు, ఇవన్నీ గంగా యమునా నది తరంగిణులైతే, తాత్త్విక దృష్టితో చేసిన సాహిత్య సృష్టి ఒక మహా సముద్రం. అందులోనే అవన్నీ అంతర్భవించటంలో ఆశ్చర్యమేముంది.

  అంచేత ఇంతకూ చెప్పవచ్చేదేమంటే బుద్ధి పూర్వకంగా నైనా సరే అబుద్ధి పూర్వకంగానైనా సరే తాత్త్విక దృష్టితో చేసిన సాహిత్య సృష్టే సృష్టి. అదే కలకాలమూ నిలుస్తుంది. అబుద్ధి పూర్వకమైతే ఎలా నిలుస్తుందని ఆశంకించరాదు. కవి ఉద్దేశించకపోయినా అతడే ఉద్దేశంతో వ్రాసినా ఆ వ్రాతలో అది అంతర్వాహినిగా చోటు చేసుకొనే ఉంటుంది. చివరకందులోనే పర్యవసిస్తుంది. ఆనాటి పురాణాలే కాదు

Page 12

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు