#


Index

ప్రతిష్ఠాపన

  నిర్మిస్తాడు కవి. అయితే సిద్ధంగా ఉన్నా ఆ సిద్ధమని చెప్పే జగత్సామగ్రి పరమేష్ఠి భావనా కల్పితమే గాని యథార్ధం కాదు గదా. అలాంటప్పుడు దాని నాలంబనం చేసుకొని కవి తన భావనా బలంతో కల్పించిన ఈ సాహిత్య జగత్తు మాత్రం వాస్తవమెలా కాగలదు. అది ఒక మారు కాల్పనికమైతే ఇది రెండు మార్లు కాల్పనికం Twice removed from truth. దీనిని బట్టి చూస్తే సాహిత్యమని ఊరక గంతులు వేయనక్కరలేదు మనం. అది ఏదో బంగారం, దానికేదో ప్రత్యేకమైన స్థాయి కల్పించాలని కంగారు పడనక్కరలేదు. వాస్తవమైన పదార్ధం కాదు. కవి భావన, అతడి దృష్టి ఏదుందో అది వాస్తవం. ఆ దృష్టి కూడా ఎంత గొప్పదైతే అంత గొప్ప వాస్తవం. గొప్ప తనమెప్పుడు వస్తుంది. అంతకంతకు ఎత్తుకుపోయే కొద్దీ గొప్పదవుతుంది దృష్టి. అది ఇంతకు ముందు వర్ణించిన వైయక్తిక సామాజిక రాజకీయ నైతికాది రంగాలేవైనా కావచ్చు. వాటిలో ఏ స్థాయి కెదిగి చూస్తాడో కవి ఆ మేరకే చూడగలుగుతుందతని దృష్టి. అక్కడికదే తనకు వాస్తవం. దాని కనుగుణమైన సృష్టి చేసే చూపుతాడు. అది ఆ మాత్రమైన ప్రయోజనాన్నే మనకందిస్తుంది.

  కాగా ఈ భావనా యాత్రలో పోవలసినంత ఎత్తులకు పోయి చూడవలసిన స్థాయి ఒకటున్నది. ఒకటి మాత్రమే ఉన్నది. అదే ఆధ్యాత్మికమైన, తత్త్వాకమైన భూమిక. అది సర్వమూ ఏకమని చూచే చూపు కాబట్టి అన్నిటికన్నా ఆఖరు భూమిక. కవి ఆ భూమిక నందుకొనేసరికి నిజమైన కవి అవుతాడు. అతడి భావనా అసలైన భావనే అవుతుంది. ఎందుకంటే పరిపూర్ణమైన తత్త్వాన్నే భావిస్తాడతడు. అలాగే దర్శిస్తాడు. ఇలాంటి సమగ్రమైన దర్శనం కలవాడే కవి. "క్రాంత దర్శీకవి: " అన్నారు. దేశకాలాదులైన అవధుల నతిక్రమించి చూడగలగటమే క్రాంత దర్శనం. అలా దర్శించే వాడికే ఋషి అని పేరు. "ఋ" అనే ధాతువుకు గతి అనీ దర్శనమనీ అర్థం. దర్శించబడేది గనుకనే సత్యాన్ని ఋతమని కూడా వ్యవహరించారు. ఇలాంటి ద్రష్టలే ఋషులంటే. కవి అనే మాట ఈ ఋషి అనే మాటకు పర్యాయమే. కనుకనే "నా నృషిః కురుతే కావ్య"మని నానుడి. ఋషికానివాడు కవి కూడా కాలేడు. అంటే ద్రష్ట Visionary అయిన వాడే కవి వాడు సృష్టించిందే కావ్యమని భావం.

Page 11

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు