#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

కామ కర్మలవల్లనే ఈ స్థితికి వచ్చింది. మరలా తన నిజస్థితినందుకొనే వరకూ దానికి శాంతి లేదు. అది ధర్మంవల్లనే సిద్ధించాలి. అందులో ప్రవృత్తి ధర్మమొకటైతే నివృత్తి ధర్మం మరొకటి. ఒకటి సత్కర్మాచరణ మూలంగా ఉత్తమ జన్మాదికమైన అభ్యుదయ ఫలాన్నిస్తుంది. మరొకటి సర్వకర్మో పరమ లక్షణమైన ఈశ్వర జ్ఞానం వల్ల నిశ్రేయస రూపమైన మోక్షమనే మహాఫలాన్నే ప్రసాదిస్తుంది. ఈ రెండింటినీ యథాశక్తిగా మానవుడాచరించి అపేక్షితమైన ఫలితాన్ని సాధించాలంటే దానికి ధర్మ సంస్థాపన అనే పేరు. ఈ ద్వివిధమైన ధర్మసంస్థాపన చేయటానికే భగవదవతారం. అందులో జగద్ధర్మాన్ని స్థాపించాలంటే దాన్ని విచ్ఛిన్నం చేయటానికి యత్నించే అసుర శక్తులను శిక్షించాలి. అవి రజస్తమో గుణాత్మకమైనవి. వాటివల్ల సత్త్వగుణోపేతమైన దేవసంపద పీడించబడుతున్నది. ఆ అసుర సంపద ఎప్పుడు శిక్షితమవుతుందో ఈ దైవసంపద అప్పుడు రక్షితమవుతుంది. ఇదే దుష్ట శిక్షణా శిష్ట రక్షణా అనేవి. తన్మూలంగా అధర్మం పూర్తిగా బలాదూరయి ధర్మం లోకంలో సుప్రతిష్ఠితమవుతుంది. నిజమే. కాని ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. దేవ మానవ దానవుల నందరినీ సృష్టించింది ఆ పరమేశ్వరుడే గదా. ఆయనే చెప్పాడు గదా “యేచైవసాత్త్వికా భావా - రాజసాస్తామసాశ్చ యే - మత్త ఏవేతి తాన్విద్ధి” సాత్త్విక రాజసాది గుణాలన్నీ నా వల్లనే ఏర్పడుతున్నాయని. అలాంటప్పుడు జీవుల తప్పేమున్నదని. ఏ గుణంతో ఎవడు పుట్టినా ఏ పనిచేసినా అది వాడి దోషం కాదు. తనదేకావలసి ఉంటుంది. మరి అలాంటప్పుడు దేవతలను దానవులు బాధిస్తున్నారని చెప్పి మరలా తానొక అవతారమెత్తి వారిని శిక్షించటమేమిటి-తన్మూలంగా వీరిని రక్షించటమేమిటి. తనకీ ప్రయాస దేనికసలు. అందరికీ ఒకే గుణమిచ్చి సమానంగానే సృష్టిస్తే సరిపోయేదిగదా.

  ఈ ప్రశ్న మనమీనాడు గాదు. ఆనాడు పరీక్షిత్తే వేశాడు శుకుణ్ణి. కాదు కాదు. వారిద్దరూ నెపంగా ఎప్పటికైనా మనబోటివారు ప్రశ్నించవచ్చునని పురాణకర్తే ప్రశ్నించుకొని సమాధానమిస్తున్నాడు శుకుడిద్వారా. శుకుడిచ్చిన సమాధానమేమంటే అయ్యా - అసలీ ప్రశ్న ఎవడు వేస్తున్నాడు. దేనితో వేస్తున్నాడు. మనబోటి తెలిసీ తెలియని మానవుడు అజ్ఞానంతో వేస్తున్నాడు. ప్రశ్న ఎప్పుడూ అజ్ఞానంతోనే గదా వేస్తావు. జ్ఞానంతో ఐతే ప్రశ్నేముంది. జ్ఞానమంటే ఏమిటిక్కడ. సర్వమ్ ఖల్విదం బ్రహ్మ - అన్నట్టు అంతా భగవత్స్వరూపమని గ్రహించటమే. మనతో కలుపుకొని

Page 129

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు