#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

6. అవతారములు - కృష్ణతత్త్వము

  మనమింతవరకూ భాగవతానికి విష్ణువే పరముడని విష్ణు పారమ్యాన్ని నిరూపించాము. ఆ విష్ణువు కూడా ఎవడో కాదు. విశుద్ధ సత్వోపాధి అయిన ఈశ్వరుడేనని కూడా ప్రతిపాదించాము. ఆ ఈశ్వరుడు విశుద్ధమైన తన మాయాశక్తి సహాయంతో ఈ లోకంలో ఎలా అవతరించాడో దాని ప్రయోజనమేమో అందులో కృష్ణావతారానికున్న ప్రకర్ష ఏమిటో చర్చించవలసి ఉన్నది. అవతారమంటే దిగి రావటమని అక్షరార్థం. ఏమిటా దిగి వచ్చేది. ఈశ్వర చైతన్యం. ఎలా రాగలదది. రావాలంటే అది సర్వవ్యాపకమూ సర్వాత్మకమైన నిర్గుణతత్త్వం కాబట్టి స్వయంగా రాలేదు. త్రిగుణాత్మకమైన తన మాయాశక్తిని వశీకరించుకొని దాని బలంతోనే రాగలదు. “సంభవా మ్యాత్మ మాయయా” అనే భగవద్వచనానికిదే అర్థం.

  సరే బాగానే ఉంది. కాని భగవానుడిలా అవతరించటానికేమిటి ప్రయోజనమని ప్రశ్న. “ప్రయోజన మనుద్దిశ్య న మందోసి ప్రవర్తతే” అన్నారు. అలాంటప్పుడు సర్వజ్ఞుడెలా ప్రవర్తిస్తాడు. స్వప్రయోజనమంటూ ఏదీ లేకపోయినా ఈ జగత్తు కోసమూ మనబోటి జీవుల కోసమూ అవతరిస్తున్నాడాయన. జగత్తనేది ఆయన సృష్టించిందే. ఆయన వివర్తమే. పోతే జీవకోటి అంతా ఆయన ఈ అండపిండాంతర్గతమై ప్రకాశించే మరొక రూపమే. వీటి రెంటినీ వినాశం పాలు కాకుండా వీటి స్థితిని కాపాడవలసి ఉంది. స్థితి కర్త విష్ణువని పేర్కొన్నాము. కాబట్టి ఆ విష్ణువే నిర్వహించాలది. ఎలాగ. ధర్మాన్ని రక్షిస్తే జగజ్జీవ స్థితులు రెండూ రక్షింపబడతాయి. జగత్తుకూ ధర్మమే మూలం. జీవుడికీ మూలం ధర్మమే. ఒకానొక సూత్రం మీద ఆధారపడి ఉంది ఈ లోకయాత్ర అంతా. అది ఉన్నంతవరకూ విశ్వం ఒడుదుడుకులు లేకుండా నడుస్తుంది. దెబ్బ తిన్నదో తల్లక్రిందులయి చేతికి చిక్కకుండా పోతుంది. దీనికే ధర్మ విప్లవమని పేరు. అలాటి ఉపద్రవం కలగకుండా ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేయటమే అవతారానికొక ప్రయోజనం.

  పోతే రెండవ ప్రయోజనం జీవధర్మ సంస్థాపన. జీవులకు కూడా ధర్మమనేదే మూలం. జీవుడంటే శరీరబద్ధమై బ్రతికే ఈశ్వర చైతన్యమే గదా. అది అవిద్యా

Page 128

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు