#


Index

విష్ణు పారమ్యము

తనువున నంటినధరణీ పరాగంబు - పూసిన వెలిభూతి పూతగాగ
ముందల వెలుగొందు ముక్తాలలామంబు-తొగల సంగడి కాని తునుక గాగ
ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్నుగాగ
కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ
హారవల్లులురగ హారవల్లులు గాగ - బాలలీల ప్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె - శివునికి దనకును వేఱులేమి దెల్ప వెలసినట్లు

  బాల్యచేష్టా విభూషితుడైన కృష్ణ పరమాత్మను చూస్తుంటే ఆ వేషం శివుని వేషాన్నే జ్ఞప్తికి తెస్తున్నది. అసలు శివుడికీ తనకూ కించిత్తు కూడా భేదం లేదని చాటటానికే అలా కనిపిస్తున్నాడట పరమాత్మ. ఇది శివ కేశవాభేదాన్ని అద్దంలో చూపినట్టు చూపే పద్యం. మూలంలో దీనికి మాతృక కానరాదు. ఇది పోతన స్వకపోల కల్పితం. ఆయన జీవించిన కాలం శైవమత విజృంభణ బాగా ఉన్న కాలం. ఆయన కుటుంబీకులంతా వచ్చీ పోయి శైవులే. ఆ ప్రభావంతోనే వీరభద్ర విజయం లాటి కావ్యాలు ముందుగా వ్రాసి ఉంటాడు. రాను రాను జీవితంలో పరిపాక మేర్పడి తత్త్వజ్ఞాని అయ్యాడు పోతన. సకల సృష్టికి మూల భూతమైన తత్త్వమేదో దానిమీదనే ఆయన దృష్టి. తద్వారా మోక్షమే ఆయన ఆసించిన మహాఫలం. అందుకే అసలు ఎత్తుగడలోనే “శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్” అని ఎత్తుకొంటాడు. “నా జననంబున్ సఫలంబు జేసెద పునర్జన్మంబు లేకుండగన్” అని ఈ బృహత్ప్రయత్నానికంతటికీ ప్రయోజనం తనకిక ఈ కర్మ భూమిపై జన్మ లేకుండా పోవటమేనని చాటుతాడు. మరి ఇలాటి జన్మ రాహిత్యం సిద్ధించాలంటే అది శివుడనీ, కేశవుడనీ ఇలా స్వల్పమైన ద్వైత దృష్టితో సతమతమయితే ఎలా సిద్ధిస్తుంది. ఈ భూమికలనన్నీ అధిగమించిన మనస్తత్త్వమున్నవాడే అది అందుకోగలడు. అదే రజస్తమోగుణమలీమసమైతే అది మరలా సుఖం లేదు. మలినమైన దర్పణం లాగానే అది యథాస్థితమైన తత్త్వాన్ని ప్రతిఫలించదు. తదీయ స్పర్శలేశ మాత్రం కూడా లేని శుద్ధ సత్త్వం కావాలది.

  సత్త్వమ్ విశుద్ధమ్ క్షేమాయ - సత్త్వమ్ యద్య్రహ్మ దర్శనమ్

Page 126

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు