#


Index

విష్ణు పారమ్యము

నమః పింగళ నేత్రాయ - పద్మనేత్రాయ వై నమః
నమః ప్రళయ కర్రేచ - నమస్త్రైలోక్యధారిణే

  చూడబోతే అసలైన అర్థనారీశ్వర రూపమిదేననిపిస్తుంది. కృష్ణుడే అంటాడసలు శంకరుణ్ణి చూచి

త్వయా యదభయం దత్తం - తద్దత్త మఖిలం మయా
అవిద్యా మోహి తాత్మానః - పురుషాభిన్న దర్శినః
వదంతి భేదం పశ్యంతి - చావయో రంతరం హర

  పనికి మాలిన వాళ్లు మనలో భేదం చూస్తారు. జ్ఞానులెప్పుడూ చూడబోరు. ఇది విష్ణు పురాణంలో బాణాసుర ఘట్టంలో కృష్ణుడి చేత బాదరాయణర్షి చెప్పించిన మాట. అంతేకాదు.

  తమో ద్రేకీచ కల్పాంతే-రుద్ర రూపీ జనార్ధనః అని కూడా అంటాడు. ప్రళయ కాలంలో తమోగుణంతో విష్ణువే రుద్రరూపాన్ని ధరించి సృష్టినంతం చేస్తున్నాడట.

  ఇలా పురాణాలన్నీ పెద్దపెట్టున ఘోషిస్తుంటే ఇంకా భేద దృష్టి పెట్టుకోటం ఎంత అవివేకం. ఈ పురాణ హృదయాన్ని మహాకవి పోతన కూడా ఎంతగా గమనించాలో అంతగా గమనించినట్టే కనిపిస్తుంది. కనుకనే నేమో సమయం వచ్చినప్పుడల్లా ఆ భేద దృష్టిని నిర్మూలించే ప్రయత్నమే చేస్తూ పోతాడాయన. భాగవతా రంభంలోనే "చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని” అని శివ కేశవుల నిద్దరినీ ఒకవేదిక మీద నిలిపి స్మరిస్తాడు. ఏకాంతంగా నదీ తీరంలో కూచొని ఈశ్వర ధ్యాన నిమీలిత లోచనుడయి ఉంటే హఠాత్తుగా ఆయన మనోనేత్రానికి శ్రీరాముడు కనిపిస్తాడు. ఆ రాజశేఖరుడెవరా అని ఆలోచిస్తున్నాడట ఆ మహాభాగవతుడు. ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే శ్రీరాముడు కనిపించట మేమిటి. దానికి జవాబాయన మాటలోనేఉంది. ఇద్దరూ రాజశేఖరులే కాబట్టి. ఎంత సుకుమారమైన శ్లేషలో ఎంత గంభీరమైన భావాన్ని ఇమిడ్చాడా మహాకవి. పోతే అన్నిటికన్నా చిత్రమేమంటే శ్రీకృష్ణుడిలో కూడా శివస్వరూపాన్నే దర్శించాడా మహాత్ముడు.

Page 125

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు