రుద్రమగ్నిమయమ్ విద్యా - ద్విష్ణు స్సోమాత్మకః స్మృతః
అగ్నీషోమాత్మకం చైవ - జగత్ప్రవర జంగమమ్
శివుడంటే అది అగ్నితత్త్వం- విష్ణువంటే సోముడు. ఈ రెండూ కలిసిందే అగ్నీషోమయాగం. అదే ఈ చరాచర రూపమైన సృష్టి అంతా. ఎంత మాటో చూడండి. ఏమిటి దీని అంతరార్థం. అగ్నిషోమమని ఒక యాగముంది. అది ఏదో బాహ్యంగా జరిగే కర్మగాదు. అంతర్యాగమది. అగ్ని అంటే అన్నింటినీ భక్షించేది మన ప్రాణం. బాహ్యంగా చెబితే వాయువు. ఈ ప్రాణంలో ఆహుతి అయ్యే అన్నమే సోముడంటే. అన్నాన్ని భక్షించేది ప్రాణమే గదా. అది అన్నమైతే ఇది అన్నాదం. ఈ అన్నాన్నాద మయమే ప్రపంచమంతా. అది ఎలాగ నామరూపాలే గదా ప్రపంచం. అదంతా మన జ్ఞానాగ్నిలో ఆహుతి అయి అందులోనే లయమవుతూంది. జ్ఞానం విషయి అయితే ఈ జ్ఞేయ ప్రపంచమంతా దానికి విషయం. విషయి విషయమయమే సమస్త సృష్టీ. ఈ విషయి విషయాలనే శివ కేశవులని భావించారు మహర్షులు. ఆ భావానికి రూపకల్పనే శివ కేశవ తత్త్వాలు. శివుడు సర్వజ్ఞుడనీ లయకారుడనీ చెప్పటం అన్నాద రూపమైన జ్ఞానాన్ని చెబుతుంది. అలాగే విష్ణువు స్థితికారుడనీ అనంత నామాలతో రూపాలతో అవతరిస్తాడని చెప్పటం అన్నరూపమైన నామ రూపాత్మ ప్రపంచాన్ని సూచిస్తుంది. జ్ఞేయజ్ఞానాలు రెండూ అవినాభావాలు. శక్తయో స్యజగత్కృత్స్నం - శక్తిమాంస్తు మహేశ్వరః - అన్నట్టు జ్ఞేయ ప్రపంచం శక్తి అయితే జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ శివం. ఇంతకూ శివశక్తి సంయోగమే శివ కేశవ తత్త్వాలు. శివశక్తులకు భేదం లేదు కనుకనే శివ కేశవులకు కూడా భేదం చూడరాదని భావం. ఈ చూపే అగ్నీషోమ యాగానుష్ఠానం.
ఈ ఆధ్యాత్మిక రహస్య మెఱిగిన మహనీయులు గనుకనే కైలాసవాసులైన మహర్షులందరూ ఏక కంఠంతో ఇలా అంటారు.
జయ కౌస్తుభ దీప్తాంగ జయ భస్మ విరాజిత
జయ చక్రగదా పాణే జయ శూలిం స్త్రిలోచన
మార్కండేయుడిలా ఘోషిస్తాడు.
Page 124