ఇది కేవలం సాంకేతికం. సత్యమ్ జ్ఞాన మనంతమ్ బ్రహ్మ అని తత్త్వాన్ని విధి ముఖంగా నిర్దేశిస్తాయి ఉపనిషత్తులు. ఇందులో సత్యమ్ సత్త్వం. దాన్ని ప్రధానంగా తీసుకొని మాటాడితే త్రిమూర్తులలో విష్ణువుకు ప్రాధాన్యం లభిస్తుంది. పోతే అనంతమనేది లయ పర్యాయం. అంతం లేనిది కదా అనంతమంటే. అంతమంటే ఏమిటి. విజాతీయమైన పదార్థమొకటి తల ఎత్తటం. అలాంటి విజాతీయమేదీ లేకుండా మాసిపోయి అంతా ఒకే ఒక సజాతీయ వస్తువే ఉన్నప్పుడది అనంతం. అంటే లయమనే అర్థం. సర్వమైన అనాత్మ ప్రపంచమూ లయమై ఆత్మ ఒక్కటే మిగిలిన దశ. అదే శివం. దాన్ని వివక్షిస్తే శివుడే విష్ణువు కంటే ప్రధానుడవుతాడు. ఈ దృష్టితోనే శివపురాణాలన్నీ శివుడికి ప్రాధాన్యమివ్వటం. కాగా జ్ఞానమని మరొక లక్షణముంది. అసలీ అనాత్మ జగతొకటి ఎక్కడా లేదు. నాలోనే ఉంది. నాలో నుంచి దాన్ని నేనే సృష్టించి బయటపెట్టగలను. అలా సృష్టించే శక్తి నాకున్నదని తెలుసుకోటమే జ్ఞానం. దీనికి ప్రాధాన్యమిస్తే అది బ్రహ్మ. కనుకనే బ్రహ్మ చతుర్ముఖుడు. సర్వతోముఖ జ్ఞానసంపన్నుడని భావం. పితామహుడు. దేవతా జ్యేష్ఠుడు. అందరికన్నా మిన్న. సృష్టి తరువాతనే గదా స్థితిలయాలు. కనుకనే జ్యేష్ఠత్వం. బ్రహ్మను గొప్పచేసి వ్రాసిన కథలన్నీ ఈ దృష్టితో సమన్వయించుకొని చూడాలి మనం. శివుడికీ విష్ణువుకూ వివాద మేర్పడితే బ్రహ్మ ఒక్కడే వచ్చి తీర్పు చెప్పినట్టు కథలెన్నో ఉన్నాయి పురాణాలలో.
మొత్తాని కేగుణాన్ని వివక్షించినప్పుడా గుణానికి ప్రతీక అయిన భగవద్రూపానికి ప్రాథమ్యం లభిస్తుంటుంది. పురాణకర్త వివక్షను బట్టి నడుస్తుంది ఇదంతా. ప్రస్తుతం భాగవతకారుడు చెప్పదలచింది సత్త్వగుణం. దాన్నే శుద్ధమైన చైతన్యానికి ప్రతీకగా భావించి మిగతా సృష్టి లయాలను దాన్ని నిరోధించే ప్రతిలోమ గుణాలుగా చూపదలచాడు. ప్రతిలోమ గుణాలెప్పుడవుతాయో అప్పుడది ఆ సత్వాని కావరణ విక్షేపాలుగా పనిచేస్తాయి. దానితో మానవుడికి కలగవలసిన జ్ఞానం కలగకపోవటమే గాక దాని బదులు అజ్ఞానమే అంతకంతకూ విజృంభిస్తుంది. వాటిని దూరం చేసుకొంటేనే గాని సత్త్వం నిర్మలమై జ్ఞానమనేది ఉదయించదు. "తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశక మనామయమ్” సత్త్వం నిర్మలమూ, ప్రకాశకమూ అయిన గుణం. సత్త్వాత్సంజాయతే జ్ఞానమన్నారు. అలాంటి నిర్మలమైన సత్త్వంవల్లనే పరమార్థ
Page 121