పరీక్షిత్తిచ్చిన సమాధానం వినండి. "భగవం స్తక్ష కాదిభ్యో మృత్యుభ్యో నబిభే మ్యహం - ప్రవిష్టో బ్రహ్మ నిర్వాణమ్ అభయం దర్శితం త్వయా” స్వామీ నేను మృత్యువంటే ఇక భయపడను. ఎందుకంటే తాము నాకు జనకుడికి యాజ్ఞవల్క్యుడిలాగా అభయ ముద్ర ఇచ్చారు. దానితో నేను బ్రహ్మ నిర్వాణాన్నే పొందాను. అని తన తృప్తిని ప్రకటిస్తాడు. బ్రహ్మ నిర్వాణ మభయమనే అంటాడు గాని వైకుంఠాదుల ప్రసక్తి తీసుకురాడిక్కడ.
ఇదంతా ఇక్కడ ఏ కరువు పెట్టటమెందుకంటే భాగవతం ఉద్దేశించిన మానవ జీవిత గమ్యమసలేమిటని. అది పరమ పురుషార్ధమైన మోక్షమనే మహాఫలం. ఆ ఫలాన్ని చవిచూడాలంటే సగుణతత్త్వాన్ని పట్టుకొంటే సుఖంలేదు. బ్రహ్మ విష్ణు శివాదులెవరైనా ఇట్లాంటి సగుణ రూపాలే. అంచేత భాగవత ప్రతిపాద్యమైన భగవత్స్వరూపం విష్ణువని వాదించటానికి లేదు. దానికి కూడా మూలభూతమైన నిర్గుణ తత్త్వమే కావాలది. అయితే ఇక్కడ విష్ణువుకే ప్రాధాన్య మిచ్చినట్టు కనిపిస్తున్నది ఏ కథ చూచినా. దానికి కారణమేమంటే త్రిగుణాలలో విష్ణువుది సత్త్వగుణం. సత్తన్నా సత్యమన్నా సత్త్వమన్నా శాబ్దికంగా ఒక్కటే. సత్తంటే ఎప్పుడూ ఉన్నదేదో అది. దానికి పుట్టటం, గిట్టటమంటూ ఉండవు. అనపాయోపజనమన్నారు దాన్ని. అపాయమంటే గిట్టటమూ, ఉపజనమంటే పుట్టటమూ. శుద్ధమైన చైతన్యమెప్పుడూ ఉండేది కాబట్టి దానికి సృష్టిలయాలనే భావాలుండరాదు. అప్పుడది శుద్ధమైన సత్త్వం. ఇలాంటి సత్త్వానికి ప్రతీకే విష్ణువు. కనుక అసలు తత్త్వానికిది చాలా సన్నిహితమైన మూర్తి. పోతే మిగతా బ్రహ్మశివుడనే మూర్తిద్వయం సృష్టి లయాల యాజమాన్యం వహించేది. సృష్టికి రజస్సు మూలమైతే లయానికి తమస్సు. రజస్త మస్సులు రెండూ స్థితికి ఆద్యంతాలు. అవి దాన్ని పరిమితం చేసి చూపే గుణాలు. కనుకనే వీటిని ఆవరణ విక్షేపాలని పేర్కొనటం. ఆవరణం స్థితిని కప్పి పుచ్చితే విక్షేపం దాన్ని చెదరగొడుతుంది. అలాగైతే అది ఇక సత్తు కాదు అసత్తు. అంచేత సత్త్వం పరిశుద్ధంగా నిలవాలంటే ఈ రెండూ దాని కధీనమై దాని కనుసన్నలలో మెలగుతుండాలి. అదే బ్రహ్మ మహేశ్వరులు విష్ణు తత్త్వానికి లోబడి ఉన్నట్టు, ఆయన అనుగ్రహానికి పాత్రులయినట్టు భాగవతం మనకు నిరూపించటంలో ఆంతర్యం.
Page 120