నిజమే అలా నిరూపించి ఉండకూడదు నిజానికి. కాని ఇక్కడ మనమంతా చాలా జాగరూకతతో గ్రహించవలసిన ధర్మ సూక్ష్మమొకటున్నది. అదేమిటంటే భాగవతమనేది అసలు రచించటంలో మహర్షి ఉద్దేశించిన పరమ ప్రయోజన మేమిటని ఆలోచించాలి మనం. దాని ఏకైక లక్ష్యం సంసార సాగరంలో పడి తల మునకలవుతున్న మనబోటి మనుష్య కీటకాలను మోక్షమనే తీరాన్ని చేర్చి కాపాడటమే. మనకందరికీ ప్రతినిధి పరీక్షిత్తు శాపమనే నెపంతో మరణ మతని కాసన్నమయింది. నేడో రేపో మృత్యు ముఖంలో ప్రవేశించబోతున్నాడు. ఆ లోపలనే ఆ మృత్యు రహస్యమేమిటో భేదించి తెలుసుకోవాలి. తెలుసుకొని మృత్యుంజయుడై మరలా ఈ సంసార సముద్రంలో పడే ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. బుద్ధి జీవుడైనందుకూ దాని బలంతో మంచి చెడ్డలను పరీక్షించే స్వభావమున్నందుకూ మానవుడు కోరవలసిన పరమ పురుషార్థమిది. సరిగా ఇదే కోరాడు పరీక్షిత్తు.
అయితే అంతవరకూ అతడు విష్ణురాతుడే. బ్రహ్మరాతుడు కాడు. అంటే సగుణమైన రూపాన్నే మనసుకు తెచ్చుకొని అదే భగవత్తత్త్వమనే భావనలో ఉన్నాడు. అలాటి భావన ఏ వైకుంఠానికో కైలాసానికో కొనిపోవలసిందే గాని పునరావృత్తి రహితమైన మోక్షాన్ని ప్రసాదించలేదు. మోక్షమే కావాలంటే అందుకు నిర్గుణమైన తత్త్వాన్ని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే అది ఎవరికి వారు యత్నిస్తే సాధ్యమయ్యేది కాదు. “ఆచార్య వాన్ పురుషోవేద" అన్నట్టు ఆచార్యుడి సహాయం కావాలి. అతడు కూడా మరలా విష్ణు రాతుడే అయి కూచుంటే లాభం లేదు. బ్రహ్మరాతుడయి ఉండాలి. అంటే సగుణంగా సోపాధికంగా కాక నిర్గుణంగా నిరుపాధికంగా ఆత్మరూపంగా దర్శించి ఉండాలి తత్త్వాన్ని. అందులో పరినిష్ఠితుడై ఉండాలి. "శ్రోత్రియమ్ బ్రహ్మ నిష్ఠమ్” అన్నదుపనిషత్తు. అలాంటి వాడే శుక మహర్షి. ఆయనకు బ్రహ్మరాతుడని పేరు. శిష్యుడు విష్ణురాతుడైతే గురువు బ్రహ్మరాతుడు. తదుపదేశ బలంతో విష్ణురాతుడు బ్రహ్మరాతుడవుతాడు. "బ్రహ్మవేద-బ్రహ్మైవ భవతి" అన్నట్టు బ్రహ్మ స్వరూపాన్ని అధిగమిస్తే బ్రహ్మమే అవుతాడు మానవుడు. మరి బ్రహ్మమనేది ఏకమేవాద్వితీయమని గదా వచనం. అంటే తనకంటే విలక్షణంగా ఏభావమూ లేని ఏకాత్మ భావాన్ని అందుకొంటాడు. అది నిష్ప్రపంచమూ నిరీశ్వరమూ అయిన అద్వైత స్థితి కాబట్టి అసలైన సిసలైన మోక్షమదే. అందులో వైకుంఠమనీ, కైలాసమనీ
Page 118