#


Index

విష్ణు పారమ్యము

చేస్తున్నాడని అర్థం. ఇలాటి ఈశ్వరుడే భాగవతం వర్ణించే ఈశ్వరుడు. భగవంతుడు. అది విష్ణువని పేరు పెట్టినా ఈశ్వరుడని పెట్టినా ఈ ఈశ్వరుడే. ఇంతకు ముందు దాహరించిన శ్లోకాలే ఇందుకు తార్కాణం. ఆ మార్గాన్నే అనుసరిస్తూ మహాకవి పోతన కూడా భాగవత హృదయాన్ని ఇలా బయటపెడతాడు.

  “ఈశుండు హరి విష్ణు డీ విశ్వ మేరీతి పుట్టించు రక్షించు పొలియ జూచు బహుశక్తి యుతుడగు భగవంతుడవ్యయు డాదినే శక్తుల నాశ్రయించి బ్రహ్మ శక్రాది రూపముల వినోదించే ఏకత్వమున నుండు నీశ్వరుండు భిన్నమూర్తి యగుచు పెక్కు విధంబుల నేల యుండు" అని పరీక్షిత్తు అడిగితే శుకుడిలా వివరిస్తాడు.

  పరుడై యీశ్వరుడై - మహా మహిముడై - ప్రాదుర్భవ స్థాన సం హరణ క్రీడనుడై - త్రిశక్తి యుతుడై - యంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామ రాధిపులకుం - బ్రాపింప రా కుండు దు స్తర మార్గంబున - తేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్

  త్రిశక్తి యుతుడై సృష్ట్యాది త్రివిధ వ్యాపారాలనూ చేసే హరి అట. ఈ హరి విష్ణువెలా అవుతాడు. విష్ణువు చేసేది ఒక వ్యాపారమే కదా. మరి భాగవతమిలాటి హరి మాహాత్మ్యాన్ని చెబుతూ ఉంది. “ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును” భాగవతమంతా హరి కథ. ఆ హరి ఇలాటివాడు. ఆయన త్రిమూర్తుల కోవకు చెందిన విష్ణువు కాదు. బ్రహ్మ కాదు. శివుడు కాదు. మూడింటినీ ముద్ద చేసిన రూపం.

  అయితే ఇప్పుడున్నట్టుండి ఒక పెద్ద సమస్యకు మనం సమాధానం చెప్పవలసి వస్తుంది. భాగవత నాయకుడు మన మనుకొనే త్రిమూర్తులలోని విష్ణువు కాదు. మంచిదే. అలాంటప్పుడు దాన్ని త్రిమూర్తులతో ప్రమేయం లేకుండా వాటి కతీతమైన తత్త్వంగానే వర్ణిస్తూ పోవాలి గదా భాగవతం. అలా పోవటం లేదే. మధ్యే మధ్యే పానీయమన్నట్టు ఎక్కడ బడితే అక్కడ త్రిమూర్తులలో ఒకడైన విష్ణువునే గొప్ప చేసి కీర్తిస్తున్నదే. దాన్ని అలా కీర్తించటమే గాక మిగతా ఇద్దరినీ దానికన్నా నికృష్ట శ్రేణికి చెందినవారుగా నిరూపిస్తున్నది గదా. మరి దీనికేమిటి సమాధానం - ఇది ఎందుకిలా జరిగిందని ప్రశ్న వస్తుంది.

Page 117

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు