ఈ విధంగా చూస్తూ పోతే బ్రహ్మ విష్ణు శివ శబ్దాలు మూడూ మన కుపనిషత్తులలోనే సాక్షాత్కరిస్తాయి. మూడూ ఈ త్రిమూర్తులను గాక అమూర్తమైన పరమాత్మ స్వరూపాన్నే మనకు బోధిస్తున్నాయి. అది కేవలం నిర్గుణమూ, నిరుపాధికమూ. అదే ఈ ప్రపంచ సృష్ట్యాదికాన్ని చేయవలసి వచ్చినప్పుడు ప్రకృతి గుణాలతో చేరి సోపాధికంగా మారుతుంది. ఈ ప్రకృతి ఎక్కడిదనే ప్రశ్న లేదు. ఇది ఆ పరమాత్మ నోతప్రోతంగా పెనవేసుకొని ఉన్న ఆయన మాయాశక్తే. సత్త్వరజస్తమో గుణత్రయాత్మక మది. “దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా” అని గదా భగవద్వచనం. ఇదుగో ఈ త్రిగుణాలతో చేరి ఎప్పుడు సోపాధికమయిందో ఆ తత్త్వం - అప్పుడు దానికి ఈశ్వరుడని పేరు వచ్చింది. ఈశ్వరుడంటే ఇక్కడ త్రిమూర్తులలో శివుడని కాదు అర్థం. సగుణమైన తత్త్వానికీశ్వరుడని శాస్త్రం పెట్టిన పేరు. అది శివుడైనా కావచ్చు. విష్ణువైనా కావచ్చు. బ్రహ్మ అయినా కావచ్చు. ఏమని పిలిచినా పిలవవచ్చు దాన్ని "త్వమ్ బ్రహ్మా త్వమ్ విష్ణుః త్వమ్ రుద్రస్త్వమ్ ప్రజాపతిః” నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పి "అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు” అని చెప్పి దాన్ని అంతర్యామిగా వర్ణిస్తున్నది వేదం. అంతర్యామి అన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే. అవ్యాకృతమైన మాయాశక్తే దాని కుపాధి. ఇంకా త్రిగుణాలు బాగా విడిబడలేదు. కాబట్టి అది సోపాధికమైన విశుద్ధోపాధి. విశుద్ధమంటే మాలిన్యలేశం కూడా లేని గుణం. అదే శుద్ధ సత్త్వం. అందులో రజస్తమస్సులనే మాలిన్యానికి చోటులేదు. అన్నీ ప్రకృతిగుణాలే అయినా సత్త్వం శుద్ధమైనది. రజస్సు తమస్సు అంత శుద్ధమయినవి కావు. కారణం అవి ఒకటి విక్షేపానికీ మరొకటి ఆవరణానికీ దారి తీస్తాయి. ఆవరణ విక్షేపాలే అవిద్యా మయమైన సంసారం. కాబట్టి అవి రెండూ బాగా తగ్గిపోయిన సత్త్వమే శుద్ధ సత్త్వం. ఇలాంటి శుద్ధసత్త్వం ఈశ్వరుడి కుపాధి. అంచేత ఉపాధి అయినా అది ఆయన నేమీ చేయలేదు. మీదు మిక్కిలి ఆయనకే అది వశవర్తిని అయి చెప్పినట్లు చేస్తూ పోతుంది. ఇదుగో ఈ ఈశ్వర లేదా అంతర్యామి అనే సగుణ బ్రహ్మమేదుందో అదే సృష్టి స్థితి లయాలనే మూడు కార్యాలు నిర్వర్తించటానికి తన మాయాశక్తిని మూడు మార్గాలలో ఉపయోగించింది. అందులో రజోగుణం వల్ల సృష్టి చేస్తుంది. అప్పుడది బ్రహ్మ. సత్త్వగుణంవల్ల పరిపాలిస్తుంది. అప్పుడది విష్ణువు. పోతే తమో గుణం
Page 115