శివ విష్ణు అనే మాటలు చూచి మన మనవసరంగా బెదరి పోతున్నాము. భాగవతంలో విష్ణు, మాధవ, నారాయణ, వాసుదేవ అనే మాటలు తరుచుగా వినిపించవచ్చు. తత్సంబంధమైన వ్యవహారమూ వర్ణించవచ్చు. అంత మాత్రాన అది శివేతరమైనదని భ్రాంతి పడరాదు. అలాగే శివ ఈశ్వర అనే శబ్దాలు చూచి అవి కేవలమా కైలాస వాసిని చెబుతున్నట్టు భావించరాదు. ఇక్కడే మనం పురాణ హృదయం జాగ్రత్తగా చూచి పట్టుకోవలసింది. పురాణం శాస్త్రార్ధానుసారి అని పేర్కొన్నాము. వేదాంత శాస్త్రం మనకు ప్రతిపాదించే భగవత్తత్త్వం రెండే రెండు విధాలు. ఒకటి నిరుపాధికం. మరొకటి సోపాధికం. ఇందులో నిరుపాధికానికి నామ రూపాదులైన ప్రకృతి గుణాలేవీ ఉండబోవు. అవన్నీ దాని కపృథ గ్భూతం Not different అంటే అవి కూడా దాని స్వరూపంలో చేరిపోయి దానికే మాత్రమూ వ్యతిరిక్తంగా కనిపించబోవు. అంచేత అది ఏకమేవా ద్వితీయమ్. దానికే బ్రహ్మమనీ, శివమనీ కూడా నామాంతరాలు. "ఏక మేవా ద్వితీయమ్ బ్రహ్మ" అని ఉపనిషద్వాక్యం. అలాగే “చతుర్థమ్ శివ మద్వైతమ్ మన్యంతే" అనే చోట శివమని వర్ణించింది
మాండూక్యోపనిషత్తు. ఇక్కడ బ్రహ్మమనేది బ్రహ్మదేవుడూ కాదు. శివమనేది పార్వతీ వల్లభుడైన శివుడూ కాదు. పేర్లు చూచి మన ములికిపడితే ఎలాగా. నిర్గుణమైన బ్రహ్మతత్త్వానికి పర్యాయాలవి. శివమన్నా బ్రహ్మ మన్నా పరమాత్మ తత్త్వమే. అంతేగాదు. నారాయణ అని కూడా నిర్దేశించారు దాన్ని. "అంతర్బహిశ్చ తత్సర్వమ్ వ్యాప్య నారాయణః స్థితః" అన్నది నారాయణానువాకం. అక్కడ నారాయణ శబ్దానికి మన మనుకొనే విష్ణువని కాదు అర్థం. పరబ్రహ్మమే. దీనిని బట్టే నారాయణః పరో 2 వ్యక్తాత్తని అవ్యాకృతానికి అతీతమైన తత్త్వంగా వర్ణిస్తుంది విష్ణు పురాణం. వాసుదేవ అనే మాటకు కూడా అదే అర్థం. వాసుదేవ స్సర్వమితి - అని భగవద్గీత చాటిందంటే ఏమిటి భావం. సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ అనే శాస్త్ర వాక్యానికది ప్రతిధ్వని గదా. వసతి దీవ్యతి ఇతి వాసుదేవః అని దాని వ్యుత్పత్తి అస్తి భాతి అని అర్థం. అంటే సచ్చిదాత్మకమైన తత్త్వమే వాసుదేవ. అంతేగాని వసుదేవుని కుమారుడయిన కృష్ణుడని కాదు అనుకోవలసింది. ఆఖరుకు విష్ణు అనే మాట కూడా నిర్గుణమైన తత్త్వాన్ని సూచిస్తుందే గాని సగుణమైన తత్త్వాన్ని కాదు. “తద్విష్ణోః పరమమ్ పద”మని ఉపనిషత్తన్న దంటే అది విష్ణులోకమైన వైకుంఠం కాదు. పరంధామం లేదా కైవల్యమని భావం.
Page 114