వైష్ణవులు తమ మతప్రచారానికి దీన్ని సాధనం చేసుకోవాలని దీనిలో ఉన్నదంతా విష్ణుతత్త్వమే-అదే పరాయణమని - అనవసరంగా లోకానికి చాటుతున్నారు. ఎంత చాటినా అది చెల్లేది గాదు. అది వారి పాక్షికమైన దృష్టే గాని అసలు పురాణ తాత్పర్యం గాదు. పురాణ నిర్మాత అయిన బాదరాయణుని వివక్షితమంతకన్నా కాదు. ఇది మనకు నిస్సంశయంగా బోధపడాలంటే భాగవత రచనా స్వరూపాన్ని పైపైన గాక ఆమూలాగ్రమూ మరలా లోతుకు దిగి పరిశీలించాలి మనం. అలా పరిశీలించాలంటే కేవల పురాణ దృష్టి మాత్రమే అయితే పనికి రాదు. శాస్త్ర దృష్టి కావాలి. ఎందుకంటే పురాణాలనేవి స్వతంత్రమైన రచనలు కావు. అవి ఉపనిషదాదికమైన శాస్త్రానికి శేష భూతమైన Supplementary అర్థవాదాలు. శాస్త్రం చెప్పినదే అవి చెప్పాలి గాని దానికి భిన్నమైన మాట చెబితే అది సత్యం కానేరదు. సత్యం కాకుంటే అది పాక్షికమే గాని పరిపూర్ణమెలా అవుతుంది.
ప్రస్తుతం భాగవత పురాణం మనకు పరిపూర్ణమైన తత్త్వాన్నే బోధిస్తున్నది గాని పాక్షికమైన తత్త్వాన్ని కాదు. అసలు భాగవతమని పేరు పెట్టటంలోనే ఇమిడి ఉన్నదా రహస్యం. భాగవతమంటే భగవత్తత్త్వానికి చెందిందని గదా పేర్కొన్నాము. భగవంతుడంటే ఏమి టర్ధము. శివుడనా - విష్ణువనా - చతుర్ముఖుడనా. ఏదీ గాదు. అదంతా సగుణం. ప్రకృతి గుణాలైన సత్త్వరజస్తమస్సులనే ఉపాధులతో కూడినది. ఎంత విశుద్ధమని చెప్పినా ఉపాధి ఉపాధే. ఆ మేరకది పరిపూర్ణం కాదు. పరిచ్ఛిన్నమే. ఇలాంటి పరిచ్ఛిన్నమైన తత్త్వం కాదు భాగవత ముద్దేశించిన భగవత్తత్త్వం. అది పరిపూర్ణం. అంటే నిరుపాధికమైన నిర్గుణమైన తత్త్వం. భాగవతా రంభ శ్లోకమే దీనికి తార్కణం. "సత్యమ్ పరమ్ ధీమహి” అని గదా అక్కడ ఉన్న మాట. పరమమైన సత్యమట మానవుడికి ధ్యేయం. అది ఎలాంటిదా సత్యం. ఈ త్రిగుణాత్మకమైన సృష్టి అంతా మృషాభూతమైనది. అంటే పరిశుద్ధమైన తత్త్వం. అది మన ఆత్మ స్వరూపమే Subjective అందులో శివ విష్ణ్వాది భేదమే మున్నదిక. పోతే దాని తరువాత శ్లోకమిలా చాటుతున్నది. "వేద్యం వాస్తవ మత్ర వస్తు శివదమ్ తాపత్ర యోన్మూలనమ్” అధ్యాత్మికాది తాపాల నన్నింటినీ సమూలంగా ఉన్మూలనం చేసి శివమైన మోక్ష పదవిని మనకు ప్రసాదించేదట ఆ తత్త్వం. అదే ఇక్కడ ప్రతిపాదితమైన వస్తువంటాడు మహర్షి అది విష్ణువెలా అవుతుంది. విష్ణువైతే శివదమెలా కాగలదు. విష్ణుదమే కావాలది.
Page 113