ఇంతెందుకు ఋషితుల్యుడైన మహాకవులకే లేదీ భేద దృష్టి. ఇక సాక్షాత్తూ తపస్సంపన్నులైన ఋషులకెలా ఉండగలదు. కాళిదాస మహాకవి కుమార సంభవం వ్రాశాడు. రఘు వంశం వ్రాశాడు. కుమార సంభవంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలు బ్రహ్మదేవుడితో వచ్చి మొర పెట్టుకొంటారు. అప్పుడాయన బ్రహ్మదేవుణ్ణి వారు స్తోత్రం చేసిన సన్నివేశాన్ని వర్ణిస్తాడు. అలాగే పరమశివుడు తపస్సు చేసిన ఘట్టంలో. అలాగే రావణో పద్రవ పీడితులై క్షీరసాగరశాయి అయిన నారాయణుణ్ణి దర్శించి దేవతలు ఆయనను కీర్తించటం వర్ణిస్తాడు. ఈ మూడు సందర్భాలలో మహాకవి త్రిమూర్తులను ముగ్గురిని వర్ణిస్తాడు గదా. ఏ సందర్భంలో ఎవరిని వర్ణించినప్పుడా దేవుడే పరమాత్మ - అంతకన్నా పరతత్త్వమిక ఏదీ లేదనే చాటుతాడాయన. అదేమిటని అడిగితే మనకు సమాధానమిస్తున్నాడాయన. “ఏకైవ మూర్తి ర్భిభిదే త్రిధాసా" అయ్యా ఉన్నదసలు ఒకే ఒక పదార్ధమండీ. అదే మూడు రూపాలుగా భిన్నమై మనకు కనిపిస్తున్నది. "సామాన్య మేత త్ప్రథమా పరత్వం” ఆ మూడింటిలో ఏది హెచ్చు ఏది లొచ్చు అని ప్రశ్న లేదు. హెచ్చుతగ్గులు ఉంటే మూడింటికీ ఉన్నాయి. లేకుంటే దేనికీ లేదు. విష్ణోర్ఘ రస్తస్య హరిః కదాచిత్ ఒకప్పుడు విష్ణువుకు శివుడు తగ్గి ఉంటే మరొకప్పుడు శివుడికి విష్ణువు తగ్గి చేతులొగ్గి ఉంటాడు. పోతే వీరిద్దరూ బ్రహ్మదేవుడికి చేతులొగ్గితే- ఆ బ్రహ్మ వీరిద్దరికీ భృత్యాను భృత్యుడయినట్టు కనిపిస్తాడు - అని ఉన్న నిజాన్ని బయట పెడతాడు.
మహాకవులిలా వ్రాశారంటే అది ప్రాచీనులైన మహర్షుల వాణి ననువదించటమే గాని మరొకటి గాదు. వ్యాస భట్టారకులు విష్ణు పురాణంలో వర్ణించిన త్రిమూర్తుల తత్త్వాన్ని చూడండి.
సృష్టి స్థిత్యంత కరణీమ్ బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ ససంజ్ఞామ్ యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః
ఈ జనార్ధనుడంటే జనానుగ్రహకారి అయిన పరమేశ్వరుడే. ఆ ఈశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భాసిస్తున్నాడు. “శక్త యోయస్య దేవస్య - బ్రహ్మ విష్ణు శివాత్మికాః" అని వర్ణిస్తాడు మరొకచోట. అంతేకాదు.
Page 111