జ్ఞానం. కోటి కొకడి కుంటే ఎక్కువ. మిగతా వారంతా దాని కెదగలేరు. ఎదగలేక తమ బుద్ధుల పరిధిలోకి తత్త్వాన్ని దించుకొని చూస్తారు. అదీ తమ అభిరుచులకూ, సంస్కారాలకూ అనుగుణంగానే చూస్తూ పోతారు. దానితో నామరూపాది విశేషాలు వచ్చి పడతాయా తత్త్వానికి. అవి కూడా వారి దృష్టికనురూపంగానే ఏర్పడతాయి. నారాయణో పాసకులైతే చతుర్భాహువులతో శంఖ చక్రాద్యాయుధాలతో శ్రీవత్సాంకంతో పీతాంబరంతో ఇలా దర్శిస్తే ఆ రూపాన్ని - శైవోపాసకులు దానినే గజాజినంతో గంగా లంకృత జటాజూటంతో అర్ధనారీశ్వరంతో త్రిశూలాది ధారణంతో తిలకిస్తూ కూచుంటారు.
ఇలా ఉపాసకుల ఉపాసనా సౌకర్యం కోసమేర్పడిందే ఈ విభేదం. ఉపాసన
అంటే విజాతీయ భావ మేమాత్రమూ మనసుకు రాగూడదు. ఉపాస్యమైన ఆకృతి
ఏదుందో దాని కనుగుణమైన సజాతీయ భావమే తైలధారావత్తుగా ప్రసరిస్తూ పోవాలి.
అలా జరిగితే గాని దాని మీద మనసు ఏకాగ్రం కాదు. అపేక్షిత ఫలం చేకూరదు.
మరి ఇలా జరగాలంటే తన ఇష్టదైవతం తప్ప మరొక దైవాన్ని స్మరించరాదు గదా.
కనుకనే దాన్ని దీనికంటే తక్కువగా చేసి చూపటం. అన్యనిందా అన్యస్తుతయే అని
ఒక మాట ఉన్నది. ఒక దానిని నిందించటం మరొక దానిని స్తుతించటానికే నట.
అంటే దాన్ని దూషించినట్టు పైకి కనిపించినా దూషించటంలో లేదు తాత్పర్యం.
తాను కోరిన రూపం మీదనే ఉంది. ఆ రూపం మీద భక్తి తాత్పర్యాలు గట్టిగా
ఏర్పడటానికి దేవతాంతర నింద అనేది ఒక వ్యాజం. అంత మాత్రమే. మనం
కూడా చూడండి. లోకంలో ఏదైనా ఒక పని శ్రద్దగా చేసి అది సాధించాలంటే ఆ
సమయంలో మరొకపని ఎంత మంచిదైనా పెట్టుకోము. దానిని పట్టించుకోము.
ఇతరులకు కూడా పట్టించుకోవద్దని బోధిస్తాము. అయినా అటువైపు మొగ్గు
చూపుతారేమో అది అంత మంచిది కాదని కూడా త్రోపు మాటలాడుతాము. లేకుంటే
అదీగాదు ఇదీ గాదు. రెంటికీ చెడిన రేవళ్లం కావలసి వస్తుంది. ఇదుగో ఇదే ఇక్కడ
ఉన్న సూత్రం కూడా. వైష్ణవ పురాణాల్లో శివ దూషణగాని - శైవ పురాణాల్లో విష్ణు
దూషణగాని ఈ దృష్టితోనే చేయవలసి వచ్చింది. ఇంతకు మించి వేరొక నికృష్టమైన
దృష్టి పురాణ ప్రవర్తకులైన మహర్షుల కుండటానికి లేదు. ఉంటే వారు మహర్షులే
కారు.
Page 110