#


Index

విష్ణు పారమ్యము

అంటగట్టిన వాళ్లమవుతాము. అయితే ఈ కథలన్నీ ఏమిటి ఇలా ఎందుకు వర్ణించారని అడగవచ్చు. కథలనేవి కేవల మర్థవాదాలనీ సంకేతాలనీ ముందే చెప్పాము. ఒక సత్యాన్ని మనకు బోధించవలసినప్పుడు దాన్ని చిలవలు, పలవలు పెట్టి ఎంతో గొప్పగా చెప్పటమే అర్థవాదం. ఇలాటి అర్థవాదమే పురాణం. అదే భాగవతం కూడా అనుసరిస్తున్నది. అంతెందుకు, విష్ణు పురాణాలు విష్ణువును గొప్ప చేసి చెబితే శివపురాణాలు శివుణ్ణి అందరికంటే ప్రశస్తంగా వర్ణిస్తాయి. త్రిపురాసుర సంహారమింతకు ముందే ఉదాహరించి ఉన్నాము. అది శివపురాణాల్లో ఒక తీరుగా ఉంటే వైష్ణవ పురాణాల్లో మరొక తీరుగా నడుస్తున్నది. అక్కడ విష్ణువే శివుడికి బాణమైనాడు. ఇక్కడ అలా కాదు. బాణమయ్యాడని చెబితే విష్ణు గౌరవానికి లోపం. అంచేత ఆ వృత్తాంతం తీసి వేయబడింది. తీసి వేయటమే గాక మహా మాయను భేదించలేక కింకర్తవ్యతా మూఢుడైన శివుణ్ణి విష్ణువే తన వైష్ణవ మాయతో కాపాడినట్టు వర్ణించింది పురాణం.

  ఇలాగే దక్షయజ్ఞంలో వీరభద్రుడు వచ్చి యజ్ఞవిధ్వంసనం చేస్తుంటే మిగతా దేవతలతో పాటు విష్ణుమూర్తికూడా అతని ధాటికి నిలవలేక పరుగెత్తి పోతాడు. పైగా అంతకు ముందు తన సుదర్శనం వీరభద్రుడి మీద ప్రయోగిస్తే అతడది వామహస్తంతో అందుకొని చక్కిలం మాదిరి బొక్కాడని ఉంది శివపురాణాల్లో, ఇది మరి వైష్ణవ పురాణాల్లో ఇలాలేదు. ఇక్కడ అసలు విష్ణువు ప్రసక్తే తీసుకురాడు కవి. అంతేకాదు. ప్రద్యుమ్నుడి జన్మ వృత్తాంతంలో కూడా రెండింటికీ తేడా కనిపిస్తుంది. మన్మథుణ్ణి ఈశ్వరుడు దగ్ధం చేసిన తరువాత అతడనంగుడయిపోతాడు. కృష్ణావతారంలో రుక్మిణి తనకు సంతానాన్ని ప్రసాదించమని భర్తను ప్రాధేయ పడుతుంది. ఆయన వెంటనే తన పూర్వపుత్రుడు మన్మథుణ్ణి జ్ఞప్తి చేసుకొని అతణ్ణి మరలా పుత్తుడుగా పొందాలని బదరికాశ్రమానికి పోయి ఈశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయి ఆయనకా వరాన్ని ప్రస్తాదిస్తాడు. ఇది హరివంశాదులలో ఉన్న ఉదంతం. దీన్ని భాగవతాదులు మార్చి మనకు బోధిస్తాయి. అసలిక్కడ కృష్ణుడు తపస్సుకు వెళ్లటమూ లేదు. శివుడు సాక్షాత్కరించటమూ లేదు. కేవలం లవణ సాగర గర్భంలో పడి మరలా బయటపడిన తన పెనిమిటిని శంబర మాయ నుంచి రక్షించి రతీదేవి స్వయంగా కొని తెచ్చి రుక్మిణీ కృష్ణులకు సమర్పిస్తుంది

Page 108

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు