#


Index

విష్ణు పారమ్యము

దానికా పితామహుడు మనసులో కోపోద్రిక్తుడయి కూడా భృగువు తన మానస పుత్రుడే గదా అని ఆలోచించి మౌనం వహిస్తాడు. తరువాత భృగువక్కడ నుంచి నేరుగా కైలాసానికి వెళ్లి మహేశ్వరుణ్ణి చూస్తాడు. అతడెదురు వచ్చినా ఇతడులుకుపలుకు లేకుండా నిలబడతాడు. శివుడికి కోపం వచ్చి ఆ భృగువు దొమ్ము పొడవటాని కుద్యుక్తుడయి పార్వతి అనునయిస్తే ఉపశమిస్తాడు. ఆ పిమ్మట వైకుంఠానికి పయనమై పోతాడా మహర్షి. అక్కడ దివ్యాంబరాభరణధరుడై రమాదేవితో దివ్యభోగాలనుభవిస్తూ ఉన్న నారాయణుణ్ణి చూచి సహించక కాలితో తంతాడు. అతడాతణ్ణి చూచి దిగి వచ్చి పాదాభివందనం చేసి అయ్యా నన్ను మన్నించండి. మీరాక ముందుగా తెలియక అపరాధం చేశాను. నన్ను కరుణించి ఇదుగో రుచిరాసనం పైన సుఖాసీనులు కండి. తమ పాదాలను నేను ప్రక్షాళిస్తే ఆ తీర్థజలం నన్నూ నా ఉదరంలో ఉన్న సమస్త లోకాలనూ పునీతం చేస్తాయని చెబుతూ భవదీయ పదాహతి మద్భుజాంతరాని కొక అపురూపమైన అలంకారమని ఎంతగానో అనునయాలా పాలు పలుకుతాడు. దాని కానందించి భృగువు మరలా మహామునుల పాలికి వచ్చి తన పోయి వచ్చిన వృత్తాంతమంతా నివేదిస్తే వారది అంతా ఆలకించి త్రిమూర్తులలో నారాయణుడే పరాయణుడని తీర్మానిస్తారు.

  మొత్తానికీ విధంగా చూస్తూ పోతే ఎన్నైనా ఉన్నాయి సందర్భాలు. ఏ సందర్భం చూచినా విష్ణు పారమ్యాన్నే బయట పెడుతున్నది భాగవతం. మిగతా బ్రహ్మ మహేశ్వరులకు ఏ మాత్రమూ ఎక్కడా ప్రాధాన్యమిచ్చినట్టు కనిపించదు. మీదు మిక్కిలి వారిద్దరినీ విష్ణువు కంటే తక్కువగా భావించినట్టే తోస్తుంది. అది ఆయా అవతారాల వర్ణనను బట్టి చూచినా- భాగవతులైన ఆయా దేవ ఋషి రాజన్యాదుల చరిత్రను బట్టి చూచినా-ఆయా సన్నివేశాలలో విష్ణు ప్రభావాతిశయమూ - బ్రహ్మాదుల అప్రాగల్భ్యమూ -వర్ణించటాన్ని బట్టి చూచినా-అన్వయ వ్యతిరేక న్యాయాన్ని బట్టి చూస్తే-భాగవత పురాణ హృదయం సమస్త దేవతా నీకంలోనూ విష్ణువే సర్వోత్కృష్టుడని చెప్పటమే నని విష్ణు పారమ్యాన్ని చాటటమే ననీ - మన కవగతమవుతున్నది.

  కాని ఇదంతా కేవలం ఒక అపోహే. కేవల మాయాకథలలో అలా వర్ణించినంత మాత్రాన అదే భాగవత హృదయమని భ్రమించరాదు. భ్రమిస్తే అంతకన్నా భాగవతానికి మనం చేసే అపచారం లేదు. దానికి లేని అభిప్రాయం మనం దానికి

Page 107

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు