హరుడు నీకేమి కావాలని ప్రశ్నిస్తే ఎవరి నెత్తిన చేయి పెడితేవాడు భస్మం కావాలని వరం కోరుతాడు. సరే అలాగే అవుతుంది పొమ్మని ఆ దేవుడనుగ్రహిస్తాడు. అది ఎలా ఉంటుందో పరీక్షించి చూస్తానని వాడాయన మీదనే చేయి పెట్టబోతాడు. దానికాయన భీతుడై సకల లోకాలకూ పరుగెత్తి పోయి ఎక్కడా తన్నుకాపాడే దిక్కు గానక చివరకు వైకుంఠంలో ప్రవేశించి నారాయణుణ్ణి శరణు వేడతాడు. నారాయణుడది ముందుగానే తెలిసి ఆ దానవుడి దగ్గరికొక బ్రహ్మచారి రూపంలో ఎదురుగా పోయి పరమేశ్వరుడు వట్టి కల్లరీడు. అతని మాటలునమ్మి నీవు చెడిపోకు. నెత్తిన చేయి పెడితే భస్మం కావటమేమిటి. అది నీవు పరీక్షించబోతే ఎందుకని తాను పరుగెత్తటం. అప్పటికి తానిచ్చిన వరంలో తనకే విశ్వాసం లేదు గదా. మనకేమిటికి నమ్మకం. కావలసి వస్తే నీవిది పరీక్షించి చూడు నీకే తెలుస్తుందని మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు. వాడాయన అన్నంత పనీ చేసి దగ్ధశిరస్కుడై నేల కొరుగుతాడు. ఇలాటి కథా సన్నివేశాలన్నిటిలో శివుడి కంటే విష్ణువే గొప్ప అని తార్కాణ అవుతుంది మనకు.
అలాగే బ్రహ్మను కూడా ఎంతో హీనమానంగా వర్ణించిన ఘట్టాలున్నాయి. కృష్ణుణ్ణి బేలు పుచ్చాలని గో గోపగణాలను మాయం చేస్తాడు బ్రహ్మ. అది కనిపెట్టి కృష్ణుడన్నిటికీ అన్ని రూపాలు తానే ధరించి ఆ లోటు కనపడకుండా చేస్తాడు. ఒక సంవత్సరమిలా సాగిపోతుంది. తన వంచన ఫలితం లేకుండా పోయిందని తెలుసుకొని సిగ్గుపడి స్వయంగా వచ్చి కృష్ణుడి కాళ్లమీద పడతాడు పితామహుడు. తన తప్పు క్షమించమని ప్రాధేయపడతాడు. అలాగే అసలు ప్రళయ కాలంలోనే విష్ణువు నాభికమలం నుంచి జన్మించి తానెక్కడి నుంచి వచ్చాడో తనకే తెలియక అమాయికంగా వాపోతాడు. తన చేతిలోని గ్రంథాలనే హయగ్రీవు డపహరిస్తుంటే ఒళ్ళు తెలియని మైకంలో పడిపోతాడు. విష్ణువు మత్స్యావతారుడై వచ్చి తనకా వాఙ్మయం తెచ్చి ఇచ్చేవరకూ మరపు వదలలే దతనికి.
అసలా మాటకు వస్తే వాచ్యంగానే ఈ విషయాన్ని బయట పెడుతుంది భాగవతం. సరస్వతీ నదీ తీరంలో మహామునులు తపస్సు చేస్తూ త్రిమూర్తులలో ఎవ్వరధికులో తెలుసుకొని రమ్మని భృగుమహర్షిని పంపుతారు. అతడు మొదట బ్రహ్మలోకానికి పోయి ఆయనను చూచి కూడా స్తుతి నమస్కారాదులు చేయడు
Page 106