#


Index

విష్ణు పారమ్యము

శివ మహత్త్వాన్ని తెలిపే సన్నివేశాలలో కూడా విష్ణు వుదాసీనంగానే కూచున్నట్టు వర్ణించింది భాగవతం. ముఖ్యంగా దక్షుని వృత్తాంతమూ, హాలాహల భక్షణ వృత్తాంతమూ, ఇవి రెండూ మనకు మంచి నిదర్శనాలు. దక్ష ప్రజాపతి మొదట వచ్చినపుడు సభలో విష్ణుమూర్తి లేడట. బ్రహ్మ మహేశ్వరులే ఉన్నట్టు చెబుతుంది భాగవతం. వారు కూడా లేవలేదు. నిలబడలేదు. మరి ఒక విశేషమేమంటే వీరభద్రుడు దక్షాధ్వర ధ్వంసం చేసే సందర్భంలో కూడా విష్ణువక్కడ లేడట. విశ్వాత్మకుడు కాబట్టి ఇదంతా ముందుగా పసి కట్టి రాలేదట ఆయన. అలాంటి వాడు చివర మళ్లీ పశ్చాత్తప్తుడై దక్షుడు చేసిన యజ్ఞానికి హాజరవుతాడు. ఆ వచ్చినవిష్ణువును బ్రహ్మతో కలిసి రుద్రుడు కూడా ప్రశంసిస్తాడు. అంతకుముందు బ్రహ్మదేవుడు మాత్రం దక్షుని కరుణించమంటూ శివుణ్ణి ప్రార్ధన చేసినట్టుంది. అలాగే హాలాహల పానం చేయటానికాహ్వానించేటప్పుడు కూడా ముక్కోటి దేవతలతో బ్రహ్మకూడా ఈశ్వరుణ్ణి స్తుతిస్తాడు. అంతేగాని నారాయణుడు మాత్రమెక్కడా మరచి కూడా ఆయనను స్తుతించినట్టు కానరాదు భాగవతంలో.

  అంతేకాదు. అంతమాత్రమే అయితే పరవాలేదు. శివుణ్ణి సాక్షాత్తుగా కించపరచిన సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తాయి అక్కడక్కడా. ఒకటి రెండుదాహరిస్తాను. సముద్ర మథనం జరిగిపోయిన తరువాత విష్ణువు మోహినీ రూపాన్ని మరలా ఒకసారి తిలకించి ధన్యుణ్ణి కావాలనుకొన్నాడట పరమశివుడు. వెంటనే వైకుంఠానికి వెళ్లి ఆయనను స్తోత్రం చేసి ఆ రూపాన్ని దర్శించటమే వరంగా కోరుతాడు. అందుకు దరహాసం చేసి ఆ దేవుడున్నట్టుండి అంతర్హితుడవుతాడు. అతడెక్కడికి వెళ్లాడో ఏమయ్యాడో అర్థం కాక శివుడు దిక్కు తెలియక చూస్తుంటే తన ఎదుట ఒక పూలతోట ఆ తోటలో ఒయ్యారంగా నడచిపోయే ఒక ఎల నాగను తిలకిస్తాడు. చిత్తం మొత్తబడి చెఱకు విలుకాని బారికి చిక్కి ఆ వాలుగంటి వెంటబడి పోయి పోయి కళ్లు మూసుకొని గట్టిగా కౌగలించుకొంటాడు. తరువాత వీత రేతస్కుడై మరలా స్పృహ వచ్చి అదంతా విష్ణు మాయా విలాసమని ఎరిగి నివ్వెర చెందుతాడు.

  ఇలాగే మరొక సన్నివేశం. వృకుడనే రాక్షసుడు మహర్షుల నడిగి త్రిమూర్తులలో పరమేశ్వరుడే సులభ ప్రసన్నుడని తెలిసి ఆయన కోసం తపస్సు చేస్తాడు. ప్రసన్నుడైన

Page 105

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు