#


Index

విష్ణు పారమ్యము

ఏమిటీ కథ. ఎంత చిత్రంగా ఉందో చూడండి మయుడి మాయా బలానికి కూడా శివుడు జవాబు చెప్పలేక పోతే విష్ణుమాయ ఆ రాక్షస మాయను నిర్మూలించటమే గాక ఈశ్వరుణ్ణి కూడా కాపాడిందట, మరి ఈ కథ స్కాంద పురాణాదులలో ఇలా లేదు. ఆ మాటకు వస్తే మహాభారతంలో కూడా దీనికి విలక్షణంగా కనిపిస్తుంది. అక్కడ ఈశ్వరుడు కోరితే ఈ భూమండలమంతా ఆయనకు రథమై సూర్యచంద్రులా రథచక్రాలయి-నాలుగు వేదాలూ నాలుగు గుఱ్ఱాలయి బ్రహ్మదేవుడు సారథి అయి మేరుపర్వతం ధనుస్సూ వాసుకి ఆ ధనుర్గుణంగా మారితే - ఆ ధనుస్సులో సంధించిన బాణమవుతాడు విష్ణువు. ఆ బాణమీశ్వంరుడు ప్రయోగించగానే పోయి త్రిపురాలతో సహా ఆ రాక్షసులను భస్మీ భూతులను గావించినట్టు నడిచిందికథ. హరివంశంలో కూడా ఇలాగే నడుస్తుందికథ. మహా అయితే శివరథం భూమిలో క్రుంగిపోతే కేశవుడు దాన్ని పైకి లేవనెత్తుతాడు. అంతేగాని అమృతకూపాది ప్రసంగం లేదు. ఇందులో ఏది నిజమేది అబద్ధం. భాగవతాన్ని బట్టి ఇదే నిజమనుకోవలసి వస్తుంది.

  భాగవతంలో ఎక్కడ త్రిమూర్తుల ప్రస్తావన వచ్చినా విష్ణువుకంటే మిగతా ఇద్దరినీ తక్కువ చేసి వర్ణిస్తున్నట్టే కనిపిస్తుంది. విష్ణువే దేవాది దేవుడైతే మిగతా దేవతల మాదిరి బ్రహ్మా ఈశ్వరుడూ కూడా ఆ దేవుడికి భృత్యానుభృత్యులై కైంకర్యం చేస్తుంటారు. ఆయన గుణగణాలను సంకీర్తన చేస్తూ చేతులు కట్టుకుని నిలుచుంటారు. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్య సంహారం చేసి తన వేషాన్ని ఇంకా ఉపసంహరించక అలా ఉగ్రుడై చూస్తుంటే ఆయనను ప్రసన్నుణ్ణి కమ్మని దేవతలంతా ప్రార్ధిస్తుంటారు. అప్పుడు బ్రహ్మ "నతోస్మ్య నంతాయ దురంత శక్తయే” అని ప్రణామం చేస్తే రుద్రుడు "కోపకాలో యుగాంతస్తే హతోయ మసు రోల్పకః" అని మనవి చేస్తాడు. నారయణుడికి కోపం రావలసింది యుగాంతంలో నట. అంటే లయకారుడాయనే గాని తాను కాడని విష్ణువుకే పట్టం కడతాడు. సహస్ర బాహుడైన బాణాసురుణ్ణి శ్రీకృష్ణుడు కర చతుష్ట యావశిష్టునిగా తునుమాడే సమయంలో శివుడు పురుష సూక్త పురస్సరంగా కృష్ణుని స్తోత్రం చేస్తాడు. ఇలా ఎన్నో ఉన్నాయి ఘట్టాలు. చివరకు బ్రహ్మదేవుడయినా మిగతా దేవతలతో పాటు ఈశ్వరునికి ప్రణామం చేసినట్టుంది గాని విష్ణువాయనకు నమస్కరించినట్టెక్కడా లేదు.

Page 104

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు