#


Index

విష్ణు పారమ్యము

అంతేకాదు. మరొక విశేషం కూడా గమనించవచ్చు. సృష్టి స్థితి సంహారాలు మూడు వాస్తవానికి విష్ణువే నిర్వహిస్తున్నందువల్ల త్రిమూర్తులలో మిగతా ఇద్దరూ కేవలం నామమాత్రులే. ఇంద్రాది దేవతల మాదిరి వారూ ఆయన కనుసన్నలలో మెలగుతూ ఆయనకు కైంకర్య మాచరించేవారే. వారే మహాకార్యాన్ని నిర్వహించినా అది ఆయన కటాక్ష వీక్షణ బలంతో చేయవలసిన వారేగాని స్వతంత్రంగా ఏ మాత్రమూ నిర్వర్తించలేరు. భాగవత కథా గమనాన్ని బట్టి చూస్తే ఈ రహస్యం కూడా మనం గమనించవచ్చు. గజేంద్రుడు గ్రాహంపట్టు వదలించుకోలేక మొరపెట్టే సందర్భంలో ఆ గజేంద్రుడి మొర బ్రహ్మాదులందరూ ఆలంకించిన వారే. కాని “విశ్వమయత లేమి వినియు నూరక యుండి రబ్జసంభవాదులైన సురలు” బ్రహ్మాదులకు విశ్వ వ్యాపకత్వమనే గుణం లేదు. కాబట్టి గజేంద్రుడి మొర ఆలకించి కూడా వారతణ్ణి కాపాడలేక పోయారట. కాగా “విశ్వమయుడు గాన విష్ణుండు జిష్ణుండు భక్తవరుని కడ్డ పడదలంచె" అలాంటి అనన్యా దృశమైన ఐశ్వర్యమున్న వాడొక విష్ణువే. కాబట్టి ఆయనే శరణ్యమయ్యాడట చివరకు.

  ఇలాగే త్రిపురాసుర సంహార కథలో కూడా ఒక విశేషం కనిపిస్తుంది. నిజానికి త్రిపురాసురులను సంహరించిన వాడీశ్వరుడే. ఎవరి ప్రమేయమూ లేకుండానే చేశాడా పని. కానీ భాగవతమలా చెప్పదు. ఈ కథలో చాలా మార్పు తెచ్చిపెట్టింది. మయుడనే రాక్షస శిల్పి త్రిపురాలను కల్పించి రాక్షసుల కిస్తాడు. వారా పట్టణాలతో పాటు ఎగిరిపోయి త్రిలోకాలనూ ఆ కులం చేస్తుంటే దేవతలంతా పోయి మహాదేవుణ్ణి శరణు వేడుతారు. ఆయన వారి కభయమిచ్చి వింట బాణం సంధించి త్రిపురాసురుల మీద ప్రయోగిస్తాడు. వారా బాణానలంలో పడి భస్మమవుతారు. అది చూచి మాయావి అయిన మయుడొక అమృతకూపంలో వారిని పడదోస్తాడు. సిద్ధ రస స్పర్శతో వారు పునరుజ్జీవితులై వజ్ర కర్కశమైన శరీరాలతో పైకి లేస్తారు. దానికి ప్రతీకారం చేయలేక పరమేశ్వరుడు తన సంకల్పం ఫలించలేదని విమనస్కుడవుతాడు. అప్పుడాయన వై మనస్యం చూచి విష్ణు దేవుడొక ఉపాయం పన్నుతాడు. బ్రహ్మదేవుణ్ణి దూడగా తయారుచేసి తానొక ధేనువుగా మారి ఆ అమృతకూపంలో ఉండే అమృతరసాన్ని ఊచముట్ట త్రాగివేస్తాడు అది అసురులు చూచి కూడా విష్ణు మాయా మోహితులై అడ్డలేకపోతారు. అప్పుడు 'భగవత్తేజసా గుప్తో దదాహ త్రిపురం శివః' విష్ణు ప్రభావంతో శివుడు త్రిపురాసురులను దహించాడట.

Page 103

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు