#


Index

విష్ణు పారమ్యము

విష్ణుభక్తులే. విష్ణువింతియకాని వేరొండు లేదని చాటుతాడు ప్రహ్లాదుడు. అసలీ భాగవత కథా ప్రవర్తకుడైన నారదుడే విష్ణుభక్తుడు. శ్రోత అయిన పరీక్షిత్తు కసలు విష్ణురాతుడనే పేరు. కడుపులో ఉండగానే విష్ణు సందర్శనం చేసి విష్ణువు చేత రక్షింపబడ్డాడు. ఆ విష్ణుదేవునే సర్వాత్మనా ప్రపత్తి చెందాడు. అందుకే విష్ణురాతుడాయన. మరి భాగవత పురాణ నిర్మాత వేదవ్యాసుడికి కృష్ణద్వైపాయనుడని నామధేయం. కృష్ణుడి లాగే ప్రాంశుపయోద నీలతను భాసితుడాయన. కృష్ణుడంటే మరి విష్ణు నిర్విశేషుడే గదా. భాగవతాన్ని కృష్ణ చరితమే నని వర్ణించారసలు. లలిత స్కంధము కృష్ణమూలము. భాగవత పారిజాతానికి మూలాధారం కృష్ణతత్త్వమే నని బాహాటంగానే చాటుతున్నాడు మహాకవి. భాగవతమనే గాక విష్ణుభాగవతమని కూడా భాగవతానికి మరొక వ్యవహారమున్నది. పోతే ఈ భాగవత శ్రవణం చేసిన శౌనకాది మహర్షులెక్కడివారు. వారు నివసించిన ప్రదేశం నైమిశారణ్యం. దానికి విష్ణుక్షేత్రమని పేరు.

  అసలు సర్గాది పంచ లక్షణం గదా ఏ పురాణమైనా. ఇందులో సర్గం సృష్టి, ప్రతి సర్గం ప్రళయమూ, పోతే మధ్యవి మూడూ స్థితి క్రిందికి వస్తాయి. ఈ సృష్టి స్థితి లయాలనే త్రివిధ వ్యాపారాలూ విష్ణు మూలకాలేనని భాగవతం చేసే ప్రబోధం. వాసుదేవ పరోధర్మో - వాసుదేవ పరాగతిః స ఏ వేదమ్ ససర్ణాగ్రే - భగవా నాత్మ మాయయా భావయ త్యేష సత్త్వేన - లోకాస్ వై లోక భావనః యస్యాంభసి శయానస్య - యోగ నిద్రాం వితన్వతః నాభిహ్ర దాంబు జాదాసీ - ద్రహ్మా విశ్వ సృజాంపతిః

  సృష్టి కర్త అని ప్రసిద్ధి గాంచిన బ్రహ్మదేవుడు కూడా మొదట ఆయన నాభి కమలం నుంచి జన్మించిన వాడేనట. పోతే ఈ సృష్టినంతా ఉపసంహరించి తనలో లయం చేసుకొని జలార్ణవంలో యోగ నిద్రాముద్రితుడై శయనించే వాడూ ఆ నారాయణుడే. మరి స్థితి కాలంలో శిక్షించి ధర్మరక్షణ చేయటాని కాయా సమయాల్లో అవతరిస్తున్నవాడూ ఆ దేవుడే. ఈవిధంగా పురాణ ప్రక్రియానుసారంగా చూచామంటే సర్వమ్ విష్ణుమయమ్ జగత్తన్నట్టు అంతా విష్ణుపరంగానే భాసిస్తున్నది.

Page 102

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు