5. విష్ణు పారమ్యము
భాగవత కథా వస్తువంతా భగవన్మయమే భగవన్మహి మాభి వర్ణనమే అని నిరూపించాము. అది భగవంతుడైనా కావచ్చు. భాగవతులైనా కావచ్చు. అంతా భగవదాశ్రితమైనదే. ఆదిలోనూ అదే మధ్యలోనూ అదే అంతంలోనూ అదే. అందుకే దానికి భాగవతమనే నామమేర్పడిందసలు. సరే బాగానే ఉంది. అంతా భగవత్తత్త్వ ప్రఖ్యాపనమే అనేంతవరకూ మనకెలాటి ప్రశ్నా లేదు. కాని భగవంతుడు భగవంతుడంటున్నామే - ఈ భగవంతుడెవరని మాత్రం ప్రశ్నించవలసి వస్తుంది. భగవంతుడంటే త్రిమూర్తులలో ఎవరైనా కావచ్చు. బ్రహ్మ అయినా కావచ్చు. విష్ణువైనా కావచ్చు. ఈశ్వరుడైనా కావచ్చు. అందులో వైష్ణవులు విష్ణువే భగవంతుడంటే శైవులు శివుడే నని చాటుతారు. అలాంటప్పుడు భాగవతంలో ప్రబోధించిన భగవత్తత్త్వ మేమిటి. అది శివతత్త్వమా, విష్ణుతత్త్వమా లేక రెంటికీ అతీతమైన పరతత్త్వమా అని ప్రశ్న రావటం సహజమే.
ఈ ప్రశ్న నిర్ణయించటానికి మనమెంతో దూరం విచారించనక్కరలేదనిపిస్తుంది. ఎందుకంటే భాగవత మామూలాగ్రం పరిశీలించిన వారికెవరికైనా తెలుస్తుందీ పురాణమంతా విష్ణు పారమ్యాన్ని లోకానికి చాటటానికే అవతరించిందని. అవతార లీలలతో నిండి నిబిడీ కృతమయింది గదా భాగవతం. ఎక్కడ చూచినా భగవంతుడి ఏదో ఒక అవతార చరిత్రే. కాగా ఈ అవతారాలనేవన్నీ విష్ణుదేవుడివే. మత్స్యం మొదలుకొని కల్కి దాకా దశావతారాలెత్తి క్రీడించిన దేవుడు త్రిమూర్తులలో విష్ణువొక్కడే. శివుడికి లేదు బ్రహ్మకు లేదీ అవతార ప్రసక్తి. అంతేకాదు. నారద కపిల పృథు ఋషభాదులైన ఏక వింశత్యవ తారాలు దాల్చిన వాడు కూడా విష్ణువే. మరి ఏ దేవతా కాదు. అసలు భాగవతమే ఘోషిస్తున్నది విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారములని. ఆ విష్ణు అంశలూ అంశాంశలే దేవ ఋషి రాజన్యమను ప్రజాపతి ప్రభృతులంతా. భగవానుడూ విష్ణువే. భగవానుడి భక్తులందరూ కూడా వైష్ణవులే. అంబరీషుడేమి, ధ్రువుడేమి, పృథువేమి, ప్రహ్లాద కుచేలాదులేమి, అంతా
Page 101