
ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

ఇంత వరకూ మనం దేవీ అష్టోత్తర శత నామాలను ఆరోహణ క్రమంలో చెప్పుకొన్నాము. మొదటిది అవరోహణ క్రమంలో నడిస్తే ఇప్పుడీ రెండవది మరలా ఆరోహణ క్రమంలో సాగుతూపోయింది. అవ్యాజ కరుణా మూర్తి అనే నామం మొదలుకొని శ్రీ శివా అనే నామం వరకూ యాభైనాలుగు నామాలనో వర్ణించిన మార్గమంతా దేవి ఆరోహణ మార్గం. అయితే ఇంతకుపూర్వ మొక మాట చెప్పి ఉన్నాము. అవరోహణ గాని ఆరోహణగాని వాస్తవంలో చేస్తున్నది ఆ దేవి కాదు. మనబోటి జీవులమే. అవిద్యా వాసనలు వదలనంత వరకూ మనం మాటి మాటికీ ఈ సంసారాని కభిముఖంగా అవతరించ వలసిందే. అలాగే నిరంతర అభ్యాస బలంతో ఆత్మ జ్ఞానముదయిస్తే- క్రమంగా ఉత్తరణం చెంద వలసిందే. దేవీ అవతారోత్తారాలనేవి కేవలమొక అపదేశమే. అంతే గాదు. విద్యావిద్యా స్వరూపిణి అని ఆ దేవిని వర్ణించాము. కనుక ఆ దేవతకు సంబంధించిన అవిద్య మూలంగా మన అవరోహణ జరిగితే- తద్విషయమైన నిద్య మూలంగా మరలా ఆరోహణ జరగ గలదని భావించినా అది సమంజసమే. మొత్తం మీద ఎడా పెడా చెప్పుకోవటం మూలాన సంసార సాయుజ్యాలు రెండూ ఆ పరా శక్తి రెండు ముఖాలనీ- ఎందులో ఉన్నా మనమా దేవీ తత్త్వంలోనే నివసిస్తున్నామనీ- గ్రహించ గలిగితే అవరోహణ లేదూ- ఆరోహణలేదూ వాస్తవానికి. అంతా దేవీ చైతన్య స్వరూపమే. అది మన ఆత్మ స్వరూపమే.
Page 123
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు