#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

సింహావలోకనము

  దేవీ సహస్ర నామాలలో నుంచి అష్టోత్తర శత నామాలను తీసుకొని అవి రెండు భాగాలుగా విభజించి వాటి రెండింటినీ మనమింత వరకూ వ్యాఖ్యానిస్తూ వచ్చాము. అష్టోత్తర మంటే ఇది మామూలుగా మనం లలితా స్తోత్ర గ్రంధాలలో చూచే అష్టోత్తర నామాలు కావు. వాటికీ సహస్ర నామాలకూ సాజాత్యం లేదు. మనం తీసుకొన్న అష్టోత్తర మలాంటిది కాదు. ఇవి సహస్ర నామాలనుంచే స్వీకరించినవి. స్వీకరించి రహోయాగ క్రమాని కనుగుణంగా పేర్చు కొని వ్యాఖ్యానించినవి. మోక్ష సాధషణ్ణి దృష్టిలో పెట్టుకొని తీసుకోవటం వల్ల మంత్ర యోగ ఉపాసనాదులకు చెందిన మిగతా నామాల జోలికి పోదలుచుకోలేదు. అవి సాక్షాత్తు జ్ఞానానికి సంబంధించినవి కావు. కనుక జ్ఞానోపయోగులైన నామాలనే తీసుకొని వివరించటం జరిగింది.

  లలితా సహస్ర నామాలకు రహస్య నామాలని కూడా పేరున్నది. సాక్షాత్తు హయగ్రీవుడే అగస్త్య మహర్షి కుపదేశించాడని ఐతిహ్యం. ఆచార్యుడు హయగ్రీవుడు - శిష్యు డగస్త్యుడు- అంటే ఏమిటర్ధం. హయమనేది జ్ఞానానికి సంకేతం. హయగ్రీవుడంటే అప్పటికి బ్రహ్మ విద్యా పారంగతుడై లోక సంగ్రహ పరాయణుడైన ఒక ఆచార్య పురుషుడని తెలుస్తున్నది. అలాగే అగస్త్యుడంటే ఒక పర్వతంలాగా అచంచల స్వభావుడై ఏకాగ్ర చిత్తుడైన ఒక ఉత్తమ శిష్యుడనీ తేటపడుతున్నది.

Page 124

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు