
ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

జీవిత మనేది నిరాటంకంగా సాగుతూపోతుంది. భౌతిక జీవితం కాదు. చైతన్య జీవితం. చైతన్య మెప్పుడూ ఉండే వస్తువు. ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేదికాదు. అంచేత మృత్యువు లేనట్టే భవం కూడాలేదనే అనుభవం కలుగుతుంది. నిర్భవా అనే నామానికిదే అర్థం. భవం లేనిదే నిర్భవా. భవమంటే జన్మ. జన్మ ఒక కొసా మృత్యువొక కొసా జీవితానికి. అందులో మరణమనే కొస లేక పోతే జననమనే రెండవ కొసా లేదనే అర్థం. ఇందులో మృత్యు మథనీ అనేది మరణాన్ని లేదని చెబితే- నిర్బవా అనే నామం జననం లేదని చాటుతున్నది. అవి రెండూ లేని ఆ దేవతను సేనిస్తే మనం కూడా వాటిని దాటి పోగలమని తాత్పర్యం.
34. శాంతా
35. బ్రాహ్మీ
36. పరా నిష్ణా
ఈ విధంగా మరణ భయం జనన భయం రెండింటికీ తిలాంజలి ఇవ్వగలిగితే అప్పుడు మనకు మిగిలేది కేవలం శాంతావస్థే. జనన మరణాలే అశాంతి మానవులకు. అవి లయమయ్యాయంటే శాంతి అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. జననం నుంచే అస లశాంతి ఆరంభమౌతుంది. మరణం వరకూ తరిమి కొడుతుంది. మరణానంతరం జన్మిస్తే మరలా మొదలౌతుంది. ఈ విధంగా జన్మ మృత్యు పరంపర వల్లనే అశాంతి పరంపర. దానిని నిర్మూలిస్తే ఇదీ నిర్మూలమైపోతుంది. అది మొదలుకొని నిరాఘాటంగా శాంతి కొనసాగుతుంది. దానితో ఆధ్యాత్మికాది తాపత్రయం త్రోపుపడిపోతుంది. తాపత్రయ శాంతే శాంతి. కనుకనే మూడు తాపాలకూ మూడు సార్లు శాంతి మంత్రం పఠించటం. అమ్మవారు శాంత స్వరూపిణి అయి మనలను కూడా శాంతులను చేయ గలదు.
Page 104
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు