కూడా పరిత్యజించవలసి వస్తే వెనుక ముందు చూడగూడదు. అప్పుడే రాముడు లోకాభిరాము డవుతాడు. లేకుంటే జానకీరాముడే అయి కూచుంటాడు. ఇక్కడ మన మొక విషయం గ్రహించాలి. భార్యను వదిలేయటమంటే ఎంత కావలసిన పదార్థమైనా వదిలివేయటానికి తయారయి ఉండాలని అర్థం. అంతేగాని భార్యనే సాక్షాత్తూ వదిలేయాలని కాదు. అయితే రాముడు భార్యనే వదిలాడు గదా అంటే అది ఒక సంకేతమే. ఒక వైద్యుడుమన రోగానికి పథ్యం చెప్పేటప్పుడు పచ్చి మంచినీళ్ళు త్రాగకూడదని చెపుతాడు. కాని అంత కఠిన పథ్యం చేస్తే చచ్చి కూచుంటాడు రోగి. మంచినీళ్లు కూడా తాగకూడదని ఎందుకన్నాడు మరి. అలా అనకపోతే కూడు తింటాడని భయం. దానితో రోగం తిరగ బెడుతుంది. చావుకు పెడితే లంకణాలకు దిగుతుందన్నట్టు అంత తీవ్రంగా చెబితే గాని జాగ్రత్తగా ఉండడు పథ్యం విషయంలో. అలాగే ఇక్కడా వ్యవహారం. భార్యనే పరిత్యజించాడని చూపటం పాలితుల పట్ల పాలకులెంత నిస్వార్థంగా ప్రవర్తించాలో పాలకలోకానికి మహర్షి మార్గాంతరంగా బోధించటమే. మరేదీగాదు. హరిశ్చంద్రాది రాజన్యుల కథలన్నీ కూడా ఇలాంటివే.
అయితే ఇక్కడ రాముడు చేసిన చర్యలో మరొక రహస్యం కూడా ఉంది మనం గ్రహించవలసింది. రాముడు హరిశ్చంద్రుడిలాగా మానవ మాత్రుడు కాదు. పరమాత్మే ఆ రూపంలో అవతరించాడు. ఆయన అవతార ప్రయోజనం కేవలం ధర్మపాలన. ఆ కార్యాన్ని సాధించటానికి తోడు చేసుకొన్న ఉపాధులే సీతా లక్ష్మణాది పాత్రలన్నీ. తన ప్రయోజనం తీరేంత వరకే వారితో ఆ ఉపాధులతో సంబంధ మాయనకు. తీరిన తరువాత ఇక అక్కరలేదు. ఏదో ఒక నెపం పెట్టి వారిని దూరం చేసుకోవలసి ఉంది. అలాటి దూరీకరణ ప్రయత్నంలో ఒక భూమికే ఈ సీతా పరిత్యాగం. ఇది మొదటి భూమిక అయితే లక్ష్మణ పరిత్యాగం రెండవ భూమిక. ఈ విడను త్యజించటానికి ప్రజాపవాదం మీద నెపం పెట్టాడు. అతణ్ణి త్యజించటానికి దుర్వాసుడి మీద నెపం పెట్టాడు. రెండూ బుద్ధి పూర్వకంగా చేశాడు.
Page 90