సత్యాన్ని ఆవిష్కరించటానికే సంకేతాన్ని ఆశ్రయిస్తాడు కవి. మనమీ సంకేతాల ద్వారా ఆ సత్యాన్ని అందుకోవాలని బాగుపడాలని కవి ఉద్దేశం. మనమేమి చేస్తున్నాము. సత్యాన్ని విడిచిపెట్టి సంకేతానికి ప్రాధాన్య మిస్తున్నాము. దాని వల్ల వచ్చిందీ ప్రమాదమంతా. సంకేతమేమిటి. కథ ఒక సంకేతం. పాత్రలొక సంకేతం. వారి ఆలోచనలూ మాటలూ ఒక సంకేతం. అవి సత్యంకావు. అయితే రామాయణ కథే అసలు జరగలేదా అని మరలా ఉలిక్కిపడరాదు. ఏ కొంచెమో జరిగి ఉండవచ్చు. జరిగింది కొంచెమైతే కొండంత కల్పన చేశాడు వాల్మీకి. అంతా జరగనూలేదు. అసలు జరగకనూ పోలేదు. రెండింటి మిశ్రణం ఇతిహాసం. కాబట్టి సీతను రాముడు పరిత్యజించాడనే చెప్పనక్కరలేదు. ఒక వేళ సాక్షాత్తుగా పరిత్యజించాడే ననుకొన్నా భయం లేదు. లౌకికంగా జరిగిందని చెప్పినా అదీ ఒక సంకేతమే. ప్రపంచమంతా ఒక సంకేతమనే గదా వేదాంతుల తీర్మానం. అలాంటప్పుడు కావ్యంలో జరిగితేనేమి. లోకంలో జరిగితేనేమి. దాన్ని గాదు మనం పట్టుకొని వ్రేలాడవలసింది.
అయితే మరేమిటంటారు. జరిగినా కవి కల్పించినా అసలీ సన్నివేశంలోని అంతరార్థమేమా - అది మనకు అందజేసే సందేశమేమా అని. అదీ ఈ సంకేతం ద్వారా గ్రహించవలసిన సత్యం. ప్రస్తుతమా సత్య మేమిటిక్కడ. రాజైన వాడు ప్రజానురంజకంగా పాలనం చేయాలని . ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని - ప్రజలు తన విషయంలో అసంతృప్తి పొందినా అపవాదం వేసినా దానికి సమాధానం చెప్పితీరాలని - ప్రజాకార్య నిర్వహణలో స్వార్థానికి చోటులేదనీ - అవసరమైతే వ్యక్తిగత సుఖాన్నైనా వదులుకోటానికి వెనుదీయరాదని అప్పుడే రాజశబ్ద మతనికి సార్థక మవుతుందనీ - ఇలాటి గొప్ప ఆదర్శా లన్నిటికీ అది ఒక ప్రతీక. ఒక ఉదాహరణ సీతా పరిత్యాగ మనేది. సీత అంటే చాలా ఇష్టం రాముడికి. అయితే అంతకన్నా ఇష్టమైనది ధర్మం. ఆ ధర్మం కోస మిష్టమైన పత్నిని
Page 89