అంతకన్నా ఎక్కువ మోసమిది. ఎంచేతనంటే కృష్ణుడేలీల కూడా బయటపడి లోకానికి ప్రదర్శించాడు. తన వేషంలో తన భాషలో తన చేష్టలలో - ప్రతి ఒక్క కదలికలో ఇతడు భగవంతుడని లోకుల కడుగడుగునా అర్థమయ్యే లాగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తించలేదు రాముడు. మనో వాక్కాయాలలో ఎక్కడా కూడా తాను భగవంతుడని ఎవరికిగానీ ఏమాత్రమూ ఆచూకీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేనుకూడా మీలాగే కేవలం మానవుడే నన్నట్టు వ్యవహరిస్తూ వచ్చాడు జీవితంలో. అది చూచి చుట్టూ ఉన్న బంధుమిత్రాదులంతా ఆయనను మానవ మాత్రుడేనని భ్రమిస్తూ వచ్చారు. వారితోపాటు రామాయణ పాఠకులమైన మనంకూడా ఈనాడు అలాగే భ్రాంతి పడుతున్నాము.
అయితే ఇదంతా మన భ్రాంతేకాని కథానాయకుడైన రాముడికి లేదు. అంతకన్నా ఆ నాయకుణ్ణి తీర్చిదిద్దిన వాల్మీకి మహర్షికి లేదీ భ్రాంతి. వాల్మీకి రాముణ్ణి భగవంతుడని సంబోధించక పోవచ్చు. అలా వర్ణించక పోవచ్చు. పైకి వాచ్యంగా చెప్పలేదు. అంతమాత్రమే. వాచ్యంగా చెప్పకపోయినా ఆయన భగవత్తత్త్వాన్ని అడుగడుగునా మనకు ప్రతీయ మానం చేస్తూనే వచ్చాడు తన రచనలో. కాకున్నా వాచ్యంగా చెబితేనే అయినట్టు కాకుంటే కానట్టు భావించరాదు ఏవిషయం గానీ లోకంలో. అసలు వాచ్యంగా చెబితే అది కవి నైపుణ్యానికి దీపకంగాదు లోపకమని కూడా చాటుతారు కావ్య విమర్శకులైన ఆలంకారికులు. రసపోషణ చేసేకవి ఇది శృంగారమిది వీరమిది కరుణమని స్వశబ్దంచేత దాన్ని వాచ్యంగా ఎక్కడా పేర్కొనరాదు. అలా చెబితే అది ఒక పక్షి బొమ్మగీచి దాని క్రింద ఫలానా పక్షి అని దాని పేరు వ్రాసినట్టవుతుంది. దాన్ని చూడగానే ప్రేక్షకులు గ్రహించాలి గాని చిత్రకారుడు ఫలానా అని చెబితేగాదు. చెప్పవలసి వచ్చిందంటే ఆ చిత్తరువులో దాన్ని గుర్తుపట్టకుండా చేసే లోపమేదో ఒకటి ఉందన్నమాట. అలాగే శృంగారాది రసాలను కూడా ఫలానా అని పేర్కొనటంకంటే విభావాది
Page 9