#


Index

భక్తులుగాని భగవన్నని ఆయన నెక్కడా సంబోధించినట్టు నిదర్శన కనిపించదు. భగవంతుడి అవతారమేనని రూఢి అయినప్పుడు భగవంతుడని సంబోధిస్తే తప్పేముంది. మరచి కూడా అలాంటి మాట ప్రయోగించడు వాల్మీకి. మరి కృష్ణుడి విషయ మలాకాదు. ఎక్కడ చూచినా భగవాన్ భగవాన్ అనే మాట మారుమ్రోగుతూ పోతుంది సాహిత్య ప్రపంచంలో. అసలు భగవద్గీత భాగవతమని గ్రంథాలకు చేసిన నామకరణమే చాలు ఈ సత్యాన్ని మనకు చాటటానికి. దీనిని బట్టి చూచినా చెప్పవచ్చు రాముడి భగవత్తత్త్వ విషయం సందిగ్ధమేనని.

  ఏతావతా తేలిందేమిటి. కృష్ణుడిలాగా రాముడు భగవదవతారం కాదేమోనని గదా. ఇదంతా మన భ్రాంతేగాని - వేరుగాదు. కృష్ణుడూ భగవంతుడే రాముడూ భగవంతుడే. ఒకరు మాత్రమే అయి మరొకరు కాకపోలేదు. ఇంతకుముందు చెప్పినట్లు ఇద్దరూ దుష్ట శిక్షణకోస మవతరించినప్పుడే తద్ద్వారా ధర్మ సంస్థాపనం చేసినప్పుడు ఇలాంటి సందేహాని కాస్పద మేముంది. పైగా జయవిజయుల శాపవృత్తాంత మొకటి ప్రమాణ ముండగా మరొక విధంగా భావించటాని కవకాశ మెక్కడిది. అయితే ఇంతవరకూ ఉదాహరిస్తూ వచ్చిన ఉదంతాల మాట ఏమిట్ అవంతా రాముడి భగవత్తత్త్వాన్ని గాక మానవత్త్వాన్నే చాటుతున్నాయి గదా అని అడగవచ్చు.

  అదంతా అవిచారిత రమణీయమని మా సమాధానం. పూర్వాపరాలు కలియ బోసుకొని చక్కగా ఆకళించు కోక అపాతతః చూచి చేసే ఆక్షేపణలవన్నీ. అలాకాక రామాయణ మహాకావ్యాన్ని ఆ మూలాగ్రమూ బాగా లోతుకుదిగి తడవి చూచామంటే అప్పుడర్ధ మవుతుంది మనకు కృష్ణుడికన్నా ఎక్కువ లీలామానుషుడు రాముడేనని, లీలా విషయంలో ఆయనకన్నా ఈయన ఇంకా నాలుగాకు లెక్కువ చదివినవాడే గాని తక్కువ చదివినవాడు కాదు. అయితే తక్కువ వాడిలా కనిపిస్తాడు. అదేమోసం.

Page 8