#


Index

  పోతే ఇంతకన్నా ఒక పెద్ద సమాధాన మున్నది. ఇది ఒక దైవ రహస్యం. వాల్మీకి దాన్ని తన కావ్యారంభంలోనే కొంత సూచన చేసి ఉన్నాడు. అదేమిటంటే అసలీ వాలిగాని సుగ్రీవుడుగాని ఎవరు వీరు. నిజంగా వానరులా. కారు. వానర రూపాలలో అవతరించిన దేవతలు. ఇంద్రాంశలో అవతరించినవాడు వాలి. సూర్యాంశలో పుట్టినవాడు సుగ్రీవుడు. ఎందుకిలా జన్మించారు. రామకార్యార్థమని పేర్కొన్నాడు మహర్షి. రాముడెవరు. సాక్షాద్విష్ణువే. రావణుడి వల్ల బాధలు పడలేక తన్ను వేడుకొంటే వారికోసమని చెప్పి మానవుడుగా అవతరించా డాయన. తనకా ఉద్యమంలో సహాయం చేయటానికే వానరాది రూపాలతో సుగ్రీవాదు లవతరించారు. అప్పటికది రామకార్యం కూడా కాదు. దేవకార్యమే. అంటే వాలి సుగ్రీవుల కార్యమే ఇది. రాముడి కార్యం కాదన్నమాట. వారలా అవతరించిన తరువాత ఋక్షవానరాది సైన్యాలంతా అన్నగారిని కొందరూ తమ్ముణ్ణి కొందరూ ఆశ్రయించి వారిని సేవిస్తూ వచ్చారు. అన్నదమ్ము లిద్దరూ ఒద్దిక గలిగి కిష్కింధలో నివసిస్తున్నారు. వారి జీవిత ధ్యేయమంతా రావణాది రాక్షస సంహారార్థ మవతరించిన రాముడికి సహాయపడటమే. అంతేగాని తమలో తాము కీచులాడుకోటమా- పోట్లాడుకోటమూ కాదు. అది మొదలు చెడ్డబేరం. ఇలా మొదలు చెడ్డ బేరం చేసి కూచున్నా డిప్పుడు వాలి. అంత వరకూ కలిసి మెలిసి ఉన్నవాడు తమ్ముడితో నిష్కారణంగా రగడ పడ్డాడు. వాడెంతబ్రతిమాలినా వినలేదు. తరిమికొట్టాడు-చంపటానికి పూనుకొన్నాడు. చివరకు వాడి భార్యనే అపహరించాడు. చేసేది లేక సుగ్రీవుడు ఋశ్యమూకం మీద ఏదో నలుగురు నమ్మినబంట్లను చుట్టూ పెట్టుకొని నమోనమో అని బ్రతుకుతున్నాడు.

  ఇది రామబ్రహ్మాని కెక్కడలేని ఆగ్రహం తెప్పించింది. తనకు ఇద్దరూ కలిసి తోడ్పడవలసి ఉండగా వారిలో ఒకడు అన్యాయంగా ఇంకొకడిని దురుసుగా వెళ్లగొట్టి-తన బలాన్నే తాను నమ్ముకొని తనంతవాడే లేడని విర్రవీగుతున్నాడు.

Page 86